ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పటమట, ఆంధ్రప్రభ: విజయవాడ లోని తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ రామచంద్రనగర్లోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేదలకు ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించిన ఆయన, తన సొంత వ్యయంతో ఉచిత వైద్య శిబిరాలతో పాటు అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నట్లు తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గద్దె క్రాంతికుమార్, తూమాటి ప్రేమనాథ్, తాడి బాబురావు, గద్దె రమేష్, పేరేపి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
