గుడివాడలో వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు..

గుడివాడలో వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు..
తెల్లవారుజాము నుంచే ఆంజనేయ స్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలో హనుమజ్జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని వివిధ ఆంజనేయ స్వామి ఆలయాల్లో తెల్లవారుజాము నుండే వేద పండితులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంటుమిల్లి రోడ్డులోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, నాగవరప్పాడు లోని శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం, పెద్ద వీధిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం తదితర ఆలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
ఆలయాలన్నీ జై హనుమాన్ నామస్మరణతో భక్తుల నామస్మరణతో మార్మోగాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, ప్రసాద వితరణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని దేవాదాయ శాఖ అధికారి యార్లగడ్డ వాసు తెలిపారు. క్యూ లైన్లు, మంచినీటి సౌకర్యం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో హనుమజ్జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయని, భక్తులందరిపై స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని వేద పండితులు ఆకాంక్షించారు.
