ఇంద్రకీలాద్రిపై ‘యోగాంధ్ర’కు విశేష స్పందన

ఇంద్రకీలాద్రిపై ‘యోగాంధ్ర’కు విశేష స్పందన

రెండో రోజు శిక్షణలో ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు
ప్రాణాయామం, ఒత్తిడి నివారణ ఆసనాలపై అవగాహన
శిక్షణ అనంతరం ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ
జూన్ 21 వరకు ఉచిత యోగా శిబిరాలు కొనసాగింపు

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’ ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమానికి భక్తులు, నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు దుర్గగుడి మహా మండపం 6వ అంతస్తులో నిర్వహిస్తున్న యోగా శిబిరం రెండో రోజు సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగిన శిక్షణలో పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు, దేవస్థాన ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రముఖ యోగా అధ్యాపకుడు గర్రె రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో మానసిక ఒత్తిడిని తగ్గించే ఆసనాలు, శ్వాసక్రియ నియంత్రణకు సంబంధించిన ప్రాణాయామ విధానాలను ప్రాక్టికల్‌గా వివరించారు.

నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక శారీరక, మానసిక సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కార మార్గమని పేర్కొంటూ, వివిధ ఆసనాలను ప్రత్యక్షంగా ప్రదర్శించి శిక్షణార్థులకు అవగాహన కల్పించారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని సూచించారు. కార్యక్రమానికి హాజరైన భక్తుల వివరాలను దేవస్థానం ఐటీ విభాగం నమోదు చేయగా, శిక్షణ అనంతరం పాల్గొన్న వారందరికీ ఉచిత ప్రసాదాలు, చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిబిరాలు జూన్ 21వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం కొనసాగనున్నాయని దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తులు, విజయవాడ నగర వాసులు ఈ ఉచిత యోగా శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు.

Leave a Reply