మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం

సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

పాయకాపురం, ఆంధ్రప్రభ : మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని కండ్రికలో మస్జిద్.ఎ.ఇలియాస్ మస్జిద్ నిర్మాణానికి మైనారిటీ వ్యవహారాల సలహాదారులు, పోలిట్‌బ్యూరో సభ్యుడు మహమ్మద్ అహమ్మద్ షరీఫ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా కలుపుకొని ఎమ్మెల్యే బొండా ఉమా బుధవారం శంకుస్థాపన చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. మసీదులు ముస్లిం సోదరులను మంచి మార్గంలో నడిపిస్తూ, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే విధంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సుమారు ఏడు లక్షల మంది సభ్యులకు, జిల్లాలోని సుమారు 50 వేల మంది సభ్యులకు ఉపయోగపడేలా ఈ స్థలంలో మస్జిద్ నిర్మాణం చేపట్టడం శుభపరిణామమన్నారు. ఈ మస్జిద్ నిర్మాణానికి తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానికుల అభ్యర్థన మేరకు రహదారి సౌకర్యం కల్పించామని, తాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

మస్జిద్ పూర్తయిన అనంతరం నమాజ్ చేసుకునే వారికి ఇది ఆదర్శవంతమైన ప్రార్థనా మందిరంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో 64వ డివిజన్ అధ్యక్షులు రవికుమార్, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, సెంట్రల్ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ గౌస్ భాషా, పశ్చిమ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు అన్సర్, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బ వైకుంఠం, మొతుకురి ఖాసిం, ఎస్. కె రహిమ్ పాల్గొన్నారు.