ఫార్ములా-ఈ కేసులో దర్యాప్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలతో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
“అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిరోజూ పూటకో వేషం వేస్తున్నాడు. పనికిరాని డ్రామాలు చేస్తూ కుట్రలు పన్నుతున్నాడు. కానీ ఈ చిల్లర చేష్టలతో మమ్మల్ని అడ్డుకోలేరు. తెలంగాణ ప్రజల గొంతుకై మేము పోరాడుతూనే ఉంటాం,” అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు ద్వారా పంపిన రూ.44 కోట్లు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ ఖాతాలోనే ఉన్నప్పటికీ, వాటిని వెనక్కి రప్పించలేని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపినట్టు విమర్శించారు.
చట్టాలను గౌరవించే పౌరుడిగా వచ్చే సోమవారం (జూన్ 16న) ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరయ్యి, అన్నివిధాల సహకరిస్తానని స్పష్టం చేశారు.
అయితే, పదేళ్ల క్రితం నోటుకు ఓటు కేసులో నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీఎం రేవంత్ రెడ్డి కేసు ఇప్పటికీ ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. “ఇద్దరిపై ఏసీబీ కేసులున్న నేపథ్యంలో నిజమైన దోషుడు ఎవరో, నిర్దోషుడు ఎవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ ద్వారా లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా సీఎం రేవంత్?” అని సూటిగా ప్రశ్నించారు.
ఓవైపు ఖజానా ఖాళీ అని నిస్సిగ్గుగా రాష్ట్ర అసమర్థతను ఒప్పుకుంటున్న ముఖ్యమంత్రి, ఇప్పుడు దర్యాప్తుల పేరుతో ప్రజా ధనాన్ని వృధా చేయవద్దని, వెంటనే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలని కేటీఆర్ సవాలు విసిరారు.