The India Story |వివాదంలో కాజల్ సినిమా..

సెన్సార్ బోర్డు దృష్టికి ఫిర్యాదు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. టీజర్‌లో భారత వ్యవసాయం, పురుగుమందుల వినియోగం, ఆహార భద్రతపై చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులను తప్పుగా ప్రతిబింబిస్తున్నాయని ఆరోపిస్తూ అగ్రోకెమికల్ రంగానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి (సీబీఎఫ్‌సీ)కి ఫిర్యాదు చేసింది.

టీజర్‌లో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని, దేశంలో ఆహార కాలుష్యం పెరుగుతోందనే అంశాలను ప్రస్తావించారు. అయితే ఈ వాదనలకు సరైన శాస్త్రీయ ఆధారాలు చూపకుండా ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా టీజర్‌ను రూపొందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇలాంటి ప్రచారం వల్ల రైతులు, వ్యవసాయ రంగం, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజల్లో అపోహలు ఏర్పడే అవకాశం ఉందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు ముందు టీజర్‌లోని అభ్యంతరకర అంశాలను సీబీఎఫ్‌సీ క్షుణ్నంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరింది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి పలువురు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌లో చేసిన కొన్ని ఆరోపణలు, గణాంకాలకు ఆధారాలు వెల్లడించాలని కోరుతూ చిత్ర బృందానికి ఇప్పటికే న్యాయ నోటీసులు కూడా జారీ అయినట్లు సమాచారం.

శ్రేయస్ తల్పాడే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ ప్రక్రియలో ఉంది. తాజాగా వచ్చిన ఫిర్యాదుతో సినిమా చుట్టూ నెలకొన్న వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై సీబీఎఫ్‌సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సినీ, వ్యవసాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.