G7 | మోడీతో జెలెన్‌స్కీ భేటీ

  • భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
  • శాంతి, పునర్నిర్మాణం, వాణిజ్య సహకారంపై దృష్టి

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో ద్వైపాక్షిక సమావేశమ‌య్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, ప్రపంచ శాంతి, వాణిజ్య సహకారం, మానవతా సహాయం, ఉక్రెయిన్ పునర్నిర్మాణం వంటి అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులు, అంతర్జాతీయ భద్రతా సవాళ్లపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌కు జీ7 మద్దతు…

మరోవైపు జీ7 దేశాధినేతలు ఉక్రెయిన్‌కు తమ సంపూర్ణ మద్దతును మరోసారి ప్రకటించారు. రష్యా దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, సైనిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. జీ7 దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్ స్వేచ్ఛ, సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతకు తమ అచంచల మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. యుద్ధ పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ ప్రజలు చూపుతున్న ధైర్యసాహసాలను ప్రశంసించాయి.

రష్యాపై మరింత ఒత్తిడి…

రష్యా చమురు, సహజవాయు రంగాలపై ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని జీ7 దేశాలు అంగీకరించాయి. అలాగే రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఉక్రెయిన్ ఇంధన అవసరాలకు అదనపు సహాయం అందించనున్నట్లు ప్రకటించాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందాన్ని జీ7 నేతలు స్వాగతించారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలను ముగించేందుకు దౌత్యపరమైన చర్చలు, అంతర్జాతీయ సహకారం మరింత అవసరమని అభిప్రాయపడ్డారు.