బీఆర్ఎస్ హయాంలోనే విలీన గ్రామాల అభివృద్ధి ..
బీఆర్ఎస్ హయాంలోనే విలీన గ్రామాల అభివృద్ధి ..
- చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే..
గీసుగొండ, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విలీన గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, పాత పనులకు కొత్త శిలాఫలకాలు వేయడం తప్ప ప్రస్తుత ఎమ్మెల్యే సాధించింది ఏమీలేదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదివారం జీడబ్ల్యూఎంసీ 15వ డివిజన్ పరిధిలోని మొగిలిచెర్ల, గోపాలరెడ్డి నగర్, రెడ్డిపాలెం గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలోనే మొగిలిచెర్ల గ్రామానికి సొసైటీ గోదాం, బ్యాంకు, రోడ్లు, సైడ్ కాలువలు, అనుసంధాన రహదారులు వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు.
గోపాలరెడ్డి నగర్ ప్రజలకు ఇండ్ల పట్టాలు అందించిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలీన గ్రామాల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకే శంకుస్థాపనలు చేస్తూ ప్రచార ఆర్భాటం చేస్తున్నారని, కొత్తగా ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్నైనా చూపించాలని సవాల్ విసిరారు. రైతులకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మంజూరు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. త్వరలో చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి, గ్రామ మరియు బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకే గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటును కాపాడేందుకు కృషి చేయాలని చల్లా ధర్మారెడ్డి సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
