ఎన్నికల విధుల్లో మృతి చెందిన ఉపాధ్యాయుడికి ఎక్స్ గ్రేషియో చెల్లించాలి….
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం ఎంపీపీ ఎస్. ఖండాలలోని ఉపాధ్యాయుడు డి. శేషరావు, మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల విధులను నిర్వర్తించిన తరువాత ఇంటికి చేరేలోపే బస్టాండ్ సమీపంలో గుండెపోటుతో మృతి చెందారు.
ఈ సంఘటనపై స్పందిస్తూ, ఎస్టియు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు మూగ శ్రీనివాస్, జాదవ్ రవికుమార్ ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల విధులలో పాల్గొన్న ఉపాధ్యాయుడి మృతికి చాలా బాధాకరంగా ఉందని, కుటుంబానికి ఎక్స్ గ్రేషియో వెంటనే చెల్లించాలని, అవసరమైన అన్ని రకాల బెనిఫిట్స్ అందించాల్సిందిగా వారు కోరారు.
అలాగే, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా చూడాలని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను పోలింగ్ కేంద్రాలలో కల్పించాలని, విధులు ముగిసిన వెంటనే డ్యూటీ సర్టిఫికెట్లు అందించాలని, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులకు తగిన పారితోషికాన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మూగ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జాదవ్ రవికుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జాదవ్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
