Fake Seeds Mafia | జిల్లాల్లో జోరుగా నకిలీ విత్తనాల విక్రయాలు

Fake Seeds Mafia | జిల్లాల్లో జోరుగా నకిలీ విత్తనాల విక్రయాలు

Fake Seeds Mafia | వానాకాలాన్ని లక్ష్యంగా చేసుకున్న నకిలీ విత్తన ముఠాలు
బంపర్ దిగుబడి పేరుతో రైతులకు వల
నిషేధిత హెచ్‌టీఈ (బీజీ-3) పత్తి విత్తనాల దందా
తేడా గుర్తించలేక మోసపోతున్న రైతులు
బ్రాండెడ్ విత్తనాలే కొనాలని వ్యవసాయ శాఖ సూచన

Fake Seeds Mafia | హైదరాబాద్, ఆంధ్రప్రభ : వానకాలం ముంచుకొస్తోంది. ఆకాశం వైపు ఆశగా చూస్తూ అన్నదాతలు నాగళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే అదునుగా క్యాష్ చేసుకోవడానికి నకిలీ విత్తనాల ముఠాలు రంగంలోకి దిగాయి. తక్కువ ధర, బంపర్ దిగుబడి, బై బ్యాక్ గ్యారెంటీ అంటూ అమాయక రైతులను బురిడీ కొట్టించేందుకు గుట్టుచప్పుడు కాకుండా పల్లెల్లో రైతులకు వల విసురుతున్నారు.

పత్తి, మిర్చి, వరి విత్తనాలు పెద్ద మొత్తంలో పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని గ్రామాల్లో ఎరువుల దుకాణాలు నిర్వహించే వ్యాపారుల వద్ద నిల్వ చేసినట్టు సమాచారం. రైతులకు ఆఫర్లు ఇస్తూ హాట్ కేక్‌లా అమ్ముడుపోయేలా ఎత్తులు వేస్తున్నారు. ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, నారాయణపేట, సిరిసిల్ల, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో నకిలీ విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు అధికారులు గుర్తించారు.

తెలంగాణలో నకిలీ విత్తన దందాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయిదు ప్రభుత్వ శాఖల (పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ తదితర) సమన్వయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించింది. రాష్ట్రవ్యాప్తంగా విత్తన దుకాణాలు, గోదాముల్లో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని, గుర్తింపు లేని వ్యాపారుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా విత్తన దందా కొనసాగుతూనే ఉంది.

12 ప్యాకెట్లు కొనుగోలు చేస్తే రెండు ప్యాకెట్లు ఉచితం, పక్క రైతులకు విక్రయాలు చేయిస్తే ప్యాకెట్ల ధరలో 10 శాతం కమీషన్ ఇస్తామని తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టి రూ. కోట్లు సంపాదించుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. స్థానిక వ్యాపారులు కూడా తమ వద్ద ఎరువులు కొనే రైతులకు ఈ నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

మార్కెట్లో పత్తిలో హెచ్‌టీఈ (బీజీ-3) రకానికి మన దేశంలో అనుమతి లేదు. గడ్డి, పురుగు మందులను తట్టుకునే ఈ రకాన్ని సాగు చేయడంతో అధిక రసాయన మందులు చల్లి రైతులు రోగాల బారిన పడుతున్నారని గమనించి ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించింది. కానీ దిగుబడి ఎక్కువగా ఉంటుందని కొందరు గుట్టుగా ఈ రకం విత్తనాలను విక్రయిస్తున్నారు. మరికొందరు నేరుగా విత్తనాలు విక్రయిస్తే పోలీసులకు దొరుకుతామని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్టు తెలిసింది.

తేడా తెలీకే మోసం

రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో కోటి 30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. దాదాపు 60 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఎకరానికి రెండు విత్తన ప్యాకెట్ల చొప్పున పత్తి విత్తనాలే కోటి ప్యాకెట్ల దాకా అవసరమవుతోంది. విత్తనాల సరఫరా వ్యవస్థలో అనేక దశలు ఉన్నప్పటికీ సరైన తనిఖీలు జరగడం లేదు. అనుమతి లేని డీలర్లు, మధ్యవర్తులు గ్రామాల వరకు చేరి రైతులను నిండా ముంచుతున్నారు.

అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. చాలా మంది రైతులకు అసలైన విత్తనాలు, నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలో తెలియక మోసపోతున్నారు.

బ్రాండెడ్ విత్తనాలే తీసుకోవాలి: వ్యవసాయ శాఖ

దళారులు, ప్రైవేట్ వ్యక్తులు చెప్పే తక్కువ ధర ప్రచారాలను నమ్మొద్దని, వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన, ప్రభుత్వం ప్రతిపాదించిన బ్రాండెడ్ విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని వ్యవసాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. విత్తనాలు కొనేటప్పుడు కచ్చితంగా డీలర్ల నుంచి రసీదు తీసుకోవాలని, పెట్టుబడి పెట్టి, రెక్కలు ముక్కలు చేసుకునే రైతన్నలు మోసపోకుండా ఉండాలంటే ప్రభుత్వ నిఘాతో పాటు స్వయం అప్రమత్తత కూడా ఎంతో అవసరమని సూచించారు.

Leave a Reply