పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి..
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి..
- బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్.
జూలూరుపాడు, ఆంధ్రప్రభ : పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని బిజెపి పార్టీ అనుబంధ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ పిలుపునిచ్చారు.శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం,నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా పన్నెండు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రమేష్ జూలూరుపాడు గ్రామంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా చిలుకూరి రమేష్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి పర్యావరణం కాపాడటానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని,అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాడం బాధ్యతగా స్వీకరించాలని కోరారు.రోజు రోజుకు అడవులు తరిగి పోవడం వలన పర్యావరణ సమతుల్య దెబ్బతిని సమయానికి వర్షాలు పడటం లేదన్నారు.
అతివృష్టి,అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు.పర్యావరణాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్క పౌరుడు ఒక మొక్క నాటి మరో ఐదుగురు మొక్కలు నాటే విధంగా ప్రోత్సహించాలని చిలుకూరి రమేష్ అన్నారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఉపాధి హామీ పథకంలో కూలీలకు వంద రోజులు పని కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.జూలై నెల నుంచి ఎన్ఆర్జీఎస్ పథకం పేరు వికాసిత్ భారత్ జీ రామ్ జీ గా మారుతుందన్నారు.కొత్త పథకంలో కూలీలకు 125 రోజులు పని కల్పిస్తారన్నారు.
ఉపాధి హామీ పథకం నిధులను నీటి సంరక్షణకు,రోడ్లు, భవనాల నిర్మాణాలకు ఉపయోగించుకోవాలని రమేష్ సూచించారు.ఉపాధి హామీ కూలీలతో కలసి చిలుకూరి రమేష్ తాగునీటి బోర్ వేల్ కు వెళ్ళే రహదారి సమీపంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్,బిజెపి మాజీ మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిరిపురంపు పుల్లారావు,ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ షరీఫ్, బుడిపుడి ప్రభాకర్, ఇల్లంగి గోపయ్య, తాళ్లూరు సూర్యం, అనంతరాములు,దొంతుల వీరయ్య,వెంకటేశ్వర్లు,కృష్ణ, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
