పర్యావరణ పరిరక్షణకే ‘గ్రీన్ ఎనర్జీ’ : మంత్రి పొంగులేటి

పర్యావరణ పరిరక్షణకే ‘గ్రీన్ ఎనర్జీ’ : మంత్రి పొంగులేటి

  • పాలేరు పరిధిలో రూ.37.38 కోట్లతో విద్యుత్‌ పనులు
  • రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు
  • తిరుమలాయపాలెంలో సోలార్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన

తిరుమలాయపాలెం, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

శుక్రవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఆవరణలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, విద్యుత్ నియంత్రికల (ట్రాన్స్‌ఫార్మర్ల) మరమ్మత్తు కేంద్రానికి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ రంగ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నియోజకవర్గ పరిధిలో రూ.37.38 కోట్లతో విద్యుత్ సరఫరా మెరుగుదలకు పనులు చేపట్టామని, రూ.9 కోట్ల వ్యయంతో మూడు సబ్‌స్టేషన్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని వివరించారు.

దశాబ్దాలుగా ఇళ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఒకప్పుడు విద్యుత్ సమస్యలతో రైతులు రాత్రివేళల్లో పొలాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు.

అర్హులందరికీ సొంతింటి కల

అనంతరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అదనంగా మరో 2 వేల ఇళ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా, అర్హతను ప్రామాణికంగా తీసుకుని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు.

రైతాంగానికి భరోసా

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, రైతు భరోసా సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచామని తెలిపారు.

దేశంలోనే రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించామని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని సైతం సేకరించి రైతులకు అండగా నిలిచామని వివరించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పేదల వైద్య చికిత్సల కోసం రూ.1,034 కోట్లు వెచ్చించామని, నిరుద్యోగుల కోసం 72 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని పేర్కొన్నారు.

ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులు స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకే పంటల సాగు చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసచారి, జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.