కార్పొరేషన్ అధికారులపై వ్యాపారి జులుం..
- అధికారుల అక్రమ ఫిర్యాదు
- హద్దులు దాటిన హోం ఫుడ్స్ తయారీదారుడు
- హోం ఫుడ్స్ కేంద్రాలను జనావాసాల్లో నుంచి తొలగించాలని స్థానికుల
- అధికారుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటున్న హోమ్ ఫుడ్స్ నిర్వాహకుడు
ఖమ్మం, ఆంధ్రప్రభ : అధికారుల విధులను ఆటంక పరచడమే కాకుండా ఏకంగా తప్పుడు ఫిర్యాదులు చేసే స్థితికి చేరుకున్నాడు.. ఓ ఫుడ్ ఐటమ్స్ తయారీదారుడు. చర్యలకు దిగిన అధికారులను అడ్డుకోవడం, అమర్యాదకరంగా మాట్లాడటంతో ఏకంగా ఇంట్లో నెట్టి బయట తాళం వేసే స్థితికి చేరుకున్నాడంటే అతని వెనుక ఎలాంటి నేర ప్రవృత్తి కలిగిన వారి అండ దండ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అనే చర్చ ఉద్యోగస్తుల్లో జరుగుతోంది.
ఖమ్మం పార్సిబంధంలో జనావాసాల్లో బేకరీ ఫుడ్ ఐటమ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చుట్టు పక్కల నాలుగైదు డివిజన్లకు విషవాయువులు వెదజల్లే పొగను వదులుతున్నాడు. ఆ పొగతో పాడై పోయిన ఇండ్లు అనేకం ఉన్నాయి. దానికి తోడు అనేక మందికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చిన్న పిల్లలు , వృధ్దులు ఆ ప్రాంతంలో నివాసం ఉండలేక పోతున్నారు. అనేక మందికి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. అందులో నుంచి వచ్చే పొగ కారణంగా చిన్న పిల్లలతో పాటు పెద్దలకు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇంతటి ప్రమాదకరమైన పొగ గొట్టాన్ని ప్రజల మధ్యలో పెట్టి సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తున్న వ్యక్తి పై అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుకు స్పందించిన వారి పై దౌర్జన్యం
కాలుష్యం వల్ల జరుగుతున్న అనర్థాల పై విచారణ చేసి నివేదిక సమర్పించి చర్యలు తీసుకోవాలని విష వాయువులు చిమ్మే పొగ గొట్టాన్ని తొలగించాలని వచ్చిన స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పై హోమ్ ఫుడ్స్ నిర్వాహకుడు నోరు పారేసుకోవడం , నోటికి వచ్చిన బూతులు తిట్టడం , వారిని దూషించడం, అడ్డుకోవడం ఇంట్లోకి నెట్టి తాళం వేసాడు. అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు. కింది స్థాయి సిబ్బంది వీడియో రికార్డింగ్ అధికారులను బయటికి తీసుకొచ్చారు. అంతటి దుస్సాహసానికి పాల్పడిన హోమ్ ఫుడ్స్ తయారి దారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు.
అక్రమ ఫిర్యాదు
విష వాయువులు విస్తరించడాన్ని తట్టుకోలేని స్థానికులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకున్న అధికారుల పై హోమ్ ఫుడ్ తయారీదారుడు అక్రమ ఫిర్యాదు చేసాడు. తన సామాగ్రిని దొంగతనం చేసారని తప్పుడు ఫిర్యాదు చేసాడు. మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల పై తిరగబడి , వారి విధులను అడ్డుకుని , దుర్భాషలాడి , ఒక రకంగా చెప్పాలంటే దాడికి పాల్పడి పైగా అధికారుల పైనే అక్రమ కేసు పెట్టాడు. ఖమ్మంలో గతంలో ఎన్నడూ ప్రభుత్వ అధికారుల పై ఈ స్థాయి దౌర్జన్యం జరిగింది లేదు. అధికారులు ఇప్పటికైనా హోమ్ ఫుడ్ తయారీదారుడి పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తి పై చర్యలు లేవా ?
విధులకు ఆటంకం కలిగించి తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దౌర్జన్య కారుల నుంచి ఉద్యోగస్థులకు రక్షణ కల్పించకపోతే రానున్న కాలంలో ఉద్యోగస్తుల్లో అభద్రతా భావం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే అధికారులతో అనుచితంగా వ్యవహరించిన హోమ్ ఫుడ్స్ తయారీదారులను పోలీసులు అదుపులోకి తీసుకుని కఠినంగా చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగుల్లో భరోసా పెరిగి , విధులు సక్రమంగా నిర్వహించేందుకు వీలుంటుంది.
