వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం

వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం

  • ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి

నర్సంపేట, ఆంధ్రప్రభ : వడ్డెరలు లేనిదే సమాజం లేదని వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి అన్నారు. నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద గురువారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల చిత్రపటాలకు వడ్డెర సంఘం నాయకులు ఓర్సు తిరుపతి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఓర్సు తిరుపతి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన వడ్డెర కులాన్ని పట్టించు కోలేదని నేడు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించి నట్లుగా వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లుగా నేడు వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

తొలిసారిగా ఈ కార్పొరేషన్కు నల్గొండ జిల్లాకు చెందిన వడ్డెర జాతి బిడ్డ కుంజా రేణుకను కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడంతో తమ జాతికి గుర్తింపు లభించినట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వడ్డెర జాతిని ఎస్టీ జాబితాలో చేర్పించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది వడ్డెర ప్రజలకు ఇప్పటివరకు చట్టసభల్లో అడిగిబెట్టిన దాఖలాలు లేవని, ఉన్నత పదవిలో కూడా వడ్డెరలు లేరని విచారం వ్యక్తం చేశారు. చట్టసభలలో తమ జాతి వెళ్లడానికి 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిర్మాణాలలో కూడా తమ జాతి పనులు చేసుకోవడానికి 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో డిఎన్టి ప్రకారం 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ జాతి లేనిదే ఏ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదన్నారు. ప్రభుత్వ భవనాలలో గాని బావుల తవ్వకంలో గాని,చెరువుల త్రవ్వకాలలోగాని, ఇతర నిర్మాణాలలో కానీ తమ జాతి బిడ్డలే భాగస్వాములై పనులు చేసిన విషయం ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ నిర్మాణం చేపట్టిన వడ్డరులే కీలక పాత్ర పోషించినట్లు తిరుపతి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ జాతిని గుర్తించి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, అదే రీతిలో ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిర్మాణ పనులలో కూడా రిజర్వేషన్ కల్పించి తమ జాతి అభివృద్ధి చెందడానికి దోహదపడా లని కోరారు. ఈ కార్పొరేషన్ కు 100 కోట్లు కేటాయించి తమ జాతి వ్యాపారాలు చేసుకోవడా నికి వీలు కల్పించాలని తెలిపారు.

చేతి పనులపై ఆధారపడి జీవిస్తున్న వడ్డెర కుల ప్రజలను కడుపు కొట్టే విధంగా నేడు ఆధునిక యంత్రాలు రంగ ప్రవేశం చేయడంతో కడుపులు మాడి అనేక ఇబ్బందులకు గురవుతూ అన్నమో రామచంద్ర అన్న చందంగా వడ్డెర బ్రతుకులు చీకట్లోనే మరుగుతున్నా యని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు ఓర్సు సాంబయ్య,దారంగుల కొమురయ్య, ఓర్సు రాజేందర్, ఆలకుంట నాగులు, ఓర్సు రాజు, ఆలకుంట విజయ్, సంపంగి గణేష్, సాయికుమార్, రాపోలు రాములతో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply