మంత్రి తుమ్మలను కలిసిన దమ్మపేట రైతులు..
దమ్మపేట, ఆంధ్రప్రభ : దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని దమ్మపేట రెవెన్యూ మౌజాలోని సర్వే నెం 273/1 లో బాధిత రైతులు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో కలిసి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును మంత్రికి వెళ్లబోసుకున్నారు .రైతుల గోడు విన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు.
ఆ నాడు నిరుపేదలకు పంపిణీ చేసిన భూములపై రైతులకే పూర్తి హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కబ్జాదారుల బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఎప్పటిలాగే రైతులు తమ భూముల్లో ధైర్యంగా సాగు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమస్య పరిష్కారం కోసం తాను జిల్లా కలెక్టర్‌తో స్వయంగా మాట్లాడతానని, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని రైతులకు మంత్రి సూచించారు . రాష్ట్ర మంత్రి తమకు అండగా నిలవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రావు గంగాధరరావు , కొయ్యల అచ్యుతరావు ,రైతులు, స్థానికులు పాల్గొన్నారు.
