కొనుగోలు కేంద్రాల కంటే దళారులే నయం
కొనుగోలు కేంద్రాల కంటే దళారులే నయం
సంచులు రావు.. సౌకర్యాలు లేవు
వర్షం వస్తే పరదాలు లేవు తూకంలో తరుగు దోపిడి
కొనుగోలు కేంద్రాల నుండి తిరిగి వెళ్తున్న రైతులు
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఆరుకాలం కష్టపడి పండించి చేతికంది వచ్చిన పంటను ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు వెళ్తే దోపిడీ చేస్తూ నిర్వాహకులు నిండా ముంచుతున్నారని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. తిరిగి దళారుల వద్దనే అమ్ముకుంటానని కొనుగోలు కేంద్రంలో పోసిన మక్కలను తిరిగి తీసుకువెళ్లి దళారులకే విక్రయించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో సోమవారం జరిగింది.
మండలంలోని ముంగిమడుగు గ్రామానికి చెందిన రైతు దొంతు శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..తనకు ఉన్న ఎకరం భూమిలో మొక్క జొన్న పంటను సాగు చేశాడు. చేతికొచ్చిన పంటను ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర ఆశతో నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ మక్కల కొనుగోలు కేంద్రంలో 20 రోజుల క్రితం 35 బస్తాల మక్కలను పోశాడు. జాప్యం చేస్తూ కాంటాల్లో తరుగు పేరుతో బస్తా కింద కిలో అదనంగా 300 గ్రాములు తీస్తున్నారని బస్తాలను లారీలకు ఎక్కించాక డ్రైవర్లకు బేటా ఇవ్వాలని బస్తాకు రెండు రూపాయలు వసూలు చేస్తూ నిండా ముంచుతున్నారని వాపోతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

బయట దళారుల బెడదను నుంచి రైతులను ఆదుకోవాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇక్కడ ఉన్న నిర్వాహకులు తూట్లు పొడుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధించిన ఉన్నతాధికారులు చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.
