Emirates Telangana | రేవంత్‌తో ఏమిరేట్స్ ప్రతినిధుల భేటీ
కీలక ప్రతిపాదనలపై చర్చ
హైదరాబాద్‌లో విమానయాన, క్రీడారంగాల అభివృద్ధిపై కీలక ప్రతిపాదనలు
ఏ-380 సర్వీసులు, ఎంఆర్వో కేంద్రాలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ భాగస్వామ్యంపై చర్చ
Emirates Telangana | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఏమిరేట్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను విమానయాన, క్రీడారంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా పలు కీలక ప్రతిపాదనలపై ఇరువర్గాలు చర్చించాయి.
హైదరాబాద్ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాల్లో ఒకటైన ఏ-380 విమాన సర్వీసులను ప్రారంభించే అవకాశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న కొత్త విమానాశ్రయాల్లో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎంఆర్వో) కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించారు.
అదేవిధంగా, గచ్చిబౌలిలో ప్రతిపాదిత స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్పాన్సర్షిప్, సాంకేతిక సహకారం అందించే అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనల పట్ల ఏమిరేట్స్ సంస్థ సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ భాగస్వామ్యం కార్యరూపం దాల్చితే హైదరాబాద్ విమానయాన రంగంలో మరింత ప్రాధాన్యం పొందడంతో పాటు, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
