ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
పరిధిలో లేని అంశాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు ఆంధ్రప్రభ జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హామీ ఇచ్చారు. తన పరిధిలో లేని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్. హరనాథ్, ఏలూరు తాలూకా అధ్యక్షుడు గొన్నూరి శ్రీధర్ రాజు, కార్యదర్శి గంటా చంద్రశేఖర్, జిల్లా కోశాధికారి పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి మధ్యంతర భృతి మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ క్యాష్‌ను చెల్లించాలని కోరారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ వైద్యం అందుబాటులోకి తేవాలని సూచించారు.
మహిళా ఉద్యోగుల కోసం కార్యాలయాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులకు రావలసిన రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో 1999లో అమలు చేసిన విధంగా కార్యాలయాల మౌలిక సదుపాయాల కోసం శాఖల బడ్జెట్‌లో 20 శాతం నిధులను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఇచ్చే ఆదేశాలను కొంతమంది జిల్లా అధికారులు కింది స్థాయిలో సక్రమంగా అమలు చేయడం లేదని కూడా ఆయన ప్రస్తావించారు.
ఉద్యోగుల పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా శిక్షణ కేంద్రాన్ని పునరుద్ధరించాలని కోరుతూ, జిల్లా అభివృద్ధికి ఉద్యోగులు పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ వినతిపత్రాలను కలెక్టర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని అవగాహన చేసుకున్నానని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, తన పరిధిలో లేని అంశాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నివేదికలు సమర్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో ఎల్. దేవకీదేవి, జెడ్పీ సీఈవో పి. జగదాంబ, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. యు. శోభ, డీసీహెచ్‌ఎస్ డా. సి.హెచ్. బేబీ కమల, డీపీవో జి. మల్లిఖార్జునరావు, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్.కె. షబ్నమ్, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు కె. రమేష్ కుమార్, ఏ. ప్రమోద్ కుమార్, పువ్వుల ఆంజనేయులు, పి. నారాయణ, కె. పవన్, మోహన్, రామారావు, కప్పల సత్యనారాయణ, రంగమోహన్, లీలా రాణి, దయావతమ్మ, సత్యభారతి, కృష్ణవేణి, కట్టా కనకరాజు, గోపాలకృష్ణ, నాగభూషణం, యాసలపు శ్రీను, సోదిమెల్ల శివ, జిల్లా అధ్యక్షుడు సురేష్, కార్యదర్శి శ్రీధర్, టౌన్ ప్రెసిడెంట్ ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ తవుడు తదితరులు పాల్గొన్నారు.
