కొత్తింటి సంబరం.. అంతలోనే కాలువలో శవమై..
ఏలూరు, ఆంధ్రప్రభ: ఇటీవలే కొత్త ఇంటిని కొనుగోలు చేసి ఆనందంగా గృహప్రవేశానికి సిద్ధమవుతున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడి జీవితం విషాదాంతమైంది. పేదలకు అందుబాటులో వైద్య సేవలు అందిస్తూ ‘డాక్టర్ బాబు’గా గుర్తింపు పొందిన కాకిలేటి శివయ్య (55) మృతదేహం శుక్రవారం ఉదయం కొవ్వలి గ్రామ సమీపంలోని కాలువలో లభ్యమైంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వలి పంచాయతీ కార్యాలయం పక్కన ఉన్న కాలువలో ఓ మోటార్‌సైకిల్ పడిఉండటాన్ని గమనించిన స్థానికులు దానిని బయటకు తీశారు. అదే సమయంలో కాలువలో ఓ వ్యక్తి కనిపించడంతో వెంటనే బయటకు తీసి పరిశీలించగా, అతను వంగాయగూడెంకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కాకిలేటి శివయ్యగా గుర్తించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో అన్ని అంశాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
