హక్కుల కోసం… రోడ్డెక్కిన సింగరేణి అధికారులు
హక్కుల కోసం… రోడ్డెక్కిన సింగరేణి అధికారులు
- “పే అప్‌గ్రేడ్” వెంటనే అమలు చేయాలని డిమాండ్
- రెండేళ్లుగా పీఆర్పీ చెల్లింపుల్లో జాప్యంపై ఆగ్రహం
- గోదావరిఖనిలో కోల్‌బెల్ట్ ఏరియా ఆఫీసర్స్ నిరసన ర్యాలీ
గోదావరిఖని, ఆంధ్రప్రభ: సింగరేణి బొగ్గు పరిశ్రమ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న అధికారులు అంతా మూకుమ్మడిగా ఆందోళన బాట పట్టారు. హక్కుల సాధన కోసం అఖిల భారత బొగ్గు గనుల అధికారుల సంఘం (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో కోల్‌బెల్ట్ ఏరియా అధికారులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు.
బుధవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వేదికగా సింగరేణి అధికారుల సంఘం తమ న్యాయమైన హక్కుల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నల్ల కండువాలతో పాదయాత్ర నిర్వహించింది. స్థానిక ఆర్‌సీఓఏ క్లబ్ నుండి ప్రారంభమైన పాదయాత్ర ప్రధాన చౌరస్తా, ఎమ్మెల్యే క్యాంపు మీదుగా రామగుండం రీజియన్-1 సింగరేణి జీఎం కార్యాలయానికి చేరుకుంది. సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియా వ్యాప్తంగా ఉన్న అధికారులంతా కూడా నిరసన యాత్రలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు మాట్లాడుతూ కోల్ ఇండియాలో ఆరు నెలల క్రితమే పే అప్‌గ్రేడ్ అమలు జరిగిందని, ఒప్పందం ప్రకారం సింగరేణిలో కూడా పే అప్‌గ్రేడ్ అమలు చేయకుండా జాప్యం చేయడంపై సింగరేణి అధికారుల సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. అవసరమైతే సమ్మెలోకి వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెగేసి చెప్పారు.
ఆరు నెలల జాప్యం మూలంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 2,500 మందికి పైగా అధికారులు నష్టపోతున్నారని చెప్పారు. పే అప్‌గ్రేడ్ అమలు విషయంలో కమిటీ నివేదిక సమర్పించినప్పటికీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతుందో చెప్పాలని ప్రశ్నించారు. పే అప్‌గ్రేడ్‌ను సింగరేణిలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జీతంలో భాగమైన పీఆర్పీ (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) చెల్లింపులో గత రెండేళ్లుగా కాలయాపన జరుగుతుందన్నారు. 2022 నుంచి 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావలసిన పీఆర్పీ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. అధికారులకు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సంఘం ఉపాధ్యక్షుడు పోనుగోటి శ్రీనివాస్ మాట్లాడుతూ, కంపెనీలో అధికారుల పదోన్నతులు, బదిలీలు, పోస్టింగులు పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. అదేవిధంగా సింగరేణి బొగ్గు పరిశ్రమ మనుగడ కోసం, ఉద్యోగ భద్రత కోసం కొత్తగా బొగ్గు గనులను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంస్థ అభివృద్ధిలో బాధ్యతగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకోవాలన్నారు.
పాదయాత్రలో అధికారుల సంఘం ప్రతినిధులు రామగుండం ఏరియా అధ్యక్షుడు మల్లేష్, భూపాలపల్లి నజీర్, మందమరి వెంకటేశ్వర్ రెడ్డి, ప్రతినిధులు రవీందర్ రెడ్డి, వీరారెడ్డి తదితరులతో పాటు సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాకు చెందిన వందలాది మంది అధికారులు పాల్గొన్నారు.

