ఫిర్యాదుల పరిష్కారంపై అధికారుల ప్రత్యేక శ్రద్ధ అవసరం: కలెక్టర్ వెట్రిసెల్వి
ఫిర్యాదుల పరిష్కారంపై అధికారుల ప్రత్యేక శ్రద్ధ అవసరం: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలు పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన ప్రతి అర్జీని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేటులోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఇన్చార్జి డీఆర్వో ఎల్. దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి అర్జీపై అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీలు నాణ్యమైన పరిష్కారంతో పాటు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను స్వయంగా కలిసి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని చెప్పారు.
ప్రతి సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలపై శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దివ్యాంగుని చెంతకు స్వయంగా వెళ్లి అర్జీని స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకుని భరోసా ఇచ్చారు.
ఈ రోజు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో మొత్తం 323 అర్జీలు స్వీకరించారు.
స్వీకరించిన కొన్ని అర్జీలు:
ఏలూరు మండలం పోణంగి గ్రామానికి చెందిన తాడిశెట్టి వెంకన్న తన పెద్ద కుమారుడు దౌర్జన్యంగా పంటభూమిని ఆక్రమించుకున్నాడని, జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నానని న్యాయం చేయాలని కోరారు.
చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన అల్లం నర్సుల లక్ష్మి తన పంటభూమి ఆక్రమణకు గురైందని, సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలని కోరారు.
ఏలూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి వెంకట రమణ చేపల చెరువు లీజు తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లించకుండా చెరువును స్వాధీనం చేసుకున్నాడని న్యాయం చేయాలని కోరారు.
కైకలూరు మండలం మారిశెట్టి లక్ష్మి తమ ప్రాంతంలో రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని, డ్రైనేజీలు బ్లాక్ అయ్యాయని విచారణ జరిపించాలని కోరారు.
కైకలూరు గ్రామానికి చెందిన కీర్తి వెంకట రామ్ ప్రసాదు కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి ప్రధాన ప్రాంతాల్లో రద్దీ ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
