Eluru | వెట్టిచాకిరీ నిర్మూలనతోనే నవసమాజ నిర్మాణం..

Eluru | వెట్టిచాకిరీ నిర్మూలనతోనే నవసమాజ నిర్మాణం..

Eluru | ఏలూరు, ఆంధ్రప్రభ : వెట్టిచాకిరీ వ్యవస్థను సమాజం నుండి శాశ్వతంగా రూపుమాపాలనే ఉద్దేశంతో, ఫిబ్రవరి 9న జరగనున్న “వెట్టిచాకిరీ నిర్మూలన దినోత్సవం” పురస్కరించుకుని ఏలూరు జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం స్థానిక చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లలో ఆశ్రయం పొందుతున్న జూనియర్ మరియు సీనియర్ విద్యార్థులకు ప్రత్యేక పోటీలు నిర్వహించారు.

విద్యార్థులలో సామాజిక చైతన్యం

ఈ సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజంలో ఇంకా అక్కడక్కడ కొనసాగుతున్న వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థలను వేర్లతో సహా తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థులకు ఈ అంశాలపై అవగాహన కల్పించేందుకు వ్యాసరచన పోటీలు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పిల్లలు తమ ప్రసంగాల ద్వారా వెట్టిచాకిరీ నిర్మూలన ఆవశ్యకతను చాటిచెప్పారు. విజేతలకు త్వరలో బహుమతులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రజా చైతన్య ర్యాలీలు మరియు సమావేశాలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ర్యాలీలు, సంబంధిత వాటాదారులతో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వెట్టిచాకిరీకి గురవుతున్న వారిని గుర్తించి, వారికి విముక్తి కల్పించి, ప్రభుత్వ పథకాల ద్వారా పునరావాసం కల్పించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారులు, సి.సి.ఐ నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply