రెచ్చిపోతున్న మట్టి మాఫియా

రెచ్చిపోతున్న మట్టి మాఫియా
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లాలో వేసవి కాలం వచ్చిదంటే మట్టి మాఫియాకు అడ్డూ..అదుపు లేకుండా పోతుంది. రబీ కోతల అనంతరం చేలలో మట్టిని స్థలాలు పూడ్చేందుకు, పల్లపు భూమిని పూడ్చేందుకు అనువైన వాతావరణం ఉండటంతో ఈ మాఫియా రంగంలోకి దిగుతుంది. సిండికేట్ గా ఏర్పడి తమ మట్టి రవాణాకు ఆటంకాలు లేకుండా ముందస్తుగానే కొందరు నాయకులు, అధికారులతో అనధికారిక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక వైపు ప్రభుత్వ భూములు , ప్రైవేటు భూములు అనే తేడా లేకుండా మట్టిని తరలించకపోతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారి పై తమ జులుముని ప్రదర్శిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కోట్ల రూపాయల్లో సాగుతున్న ఈ దందాకు అడ్డుకట్ట వేయడానికి కూడా స్థానిక అధికారులు జంకుతున్నారంటే వీరు ఏ స్థాయిలో తమ వ్యాపారం సాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు చర్యలు తూతూ మంత్రంగానే కనిపిస్తున్నాయి.
దేవాలయ భూములలో దోపిడి
ఈ వేసవిలో మట్టి మాఫియాకు కనిపించే రైతులు భూములే కాకుండా ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, కాలవగట్లు సైతం వదలడం లేదు. రెండు రోజుల క్రితం భీమవరంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి చెందిన భూమిలోని మట్టిని ఓ మట్టి వ్యాపారి అనధికారకంగా తరలించేశాడు. ఈ మట్టి తరలింపును తెలుసుకున్న ఆలయ చైర్మన్, ఈవోలు సంఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకుంటేనే గాని మట్టి తరలింపుకు అడ్డుకట్టని పరిస్థితిలో నెలకొన్నాయి. ఈ తరలింపులో అధికారులు మూడు ట్రాక్టర్లను, ఒక జెసిబిని స్వాధీనం చేసుకున్నారు. వెలుగులోకి వచ్చిన ఈ ఒక్క సంఘటన ఈ మట్టి మాఫియా బరితెగింపు ఉదాహరణగా చెప్పవచ్చు. వెలుగులోకి రాకుండా ఎన్నో దందాలు ఈ విధంగా సాగుతున్నాయి. ఆచంట మండలం నక్కల కాలవ గట్లను కూడా గత కొన్ని రోజులుగా ఇదే విధంగా దోపిడీ చేసిన సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కొందరు నాయకుల అండదండలతోటే ఈ మాఫియా రెచ్చిపోతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పగలు రాత్రి తేడా లేదు…
జిల్లాలోని భీమవరం, పాలకోడేరు, వీరవాసరం, కాళ్ల, ఆకివీడు, ఉండి, ఆచంట, తణుకు, అత్తిలి, పాలకొల్లు తదితర మండలాల్లో ఈ మట్టి వ్యాపారం జోరుగా సాగుతుంది. రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా మట్టి తరలింపు నిరంతరాయంగా సాగుతుంది. మట్టి తరలింపుకు ట్రాక్టర్లను, భారీ టిప్పర్‌ల తో భారీ స్థాయిలో తరలిస్తున్నారు. కాళ్ల మండలంలో భారీగా మట్టిని తరలిస్తుండడంతో ఆ ప్రాంతంలో రహదారులు ధ్వంసం కావటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొండాడ గ్రామంలో మట్టిని తరలించే వాహనాలను స్థానికులు అతి కష్టం మీద అడ్డుకున్నారు. స్థానికుల అడ్డుకోవడమే తప్పా అధికారులు నిలుపుదలలో ఎక్కడా కనిపించడం లేదు. ముందస్తు ఒప్పందాల ప్రకారం, అధికారుల అండదండలతో నిరంతరాయంగా ఈ అక్రమ వ్యాపారం సాఫీగా సాగిపోతుంది.
ప్రాణాలు పోతున్నాయి..
మితిమీరిన వేగంతో మట్టి తరలించే ట్రాక్టర్లు లారీలు ప్రయాణించడంతో రహదారుల పై అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తణుకులో ఆదివారం ఓ మట్టి ట్రాక్టర్ ద్విచక్ర వాహనం పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీ కొంది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందింది. నెల రోజుల క్రితం ఉండి మండలంలో మట్టి ట్రాక్టర్ వల్ల ఓ బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. పరిస్థితి విషమించడంతో అతని చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. గతంలో పెనుగొండ మండలం వడలిలో మట్టి టాక్టర్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.
మట్టి టాక్టర్ ఢీకొని జరుగుతున్న ప్రమాదాలు ఎన్నో వెలుగులోకి రాకుండా కొందరి నాయకులు అధికారుల సహకారంతో మూసేస్తున్నారు. కనీసం రోడ్డు పై మట్టి బెడ్డలు పడిపోయి ఉన్నా వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేయకపోవడంతో వాహనదారులు వీటిని ఢీకొని గాయాలు పాలు అవుతున్నారు. మట్టి తరలించే ప్రాంతాల్లో ఏ మాత్రం వర్షం పడినా ఆ రహదారులపై పేర్కొన్న మట్టిగడ్డలు కరిగి జారుడు బల్లల రహదారులుగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా వీటిని కట్టడం చేయాల్సిన యంత్రాంగం కనుచూపుమేరలో కనిపించడం లేదు.
