ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి..?

ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి..?

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : మొంథా తుఫాన్ (Montha cyclone) కారణంగా నరసాపురం మండలంలో దెబ్బ తిన్న పలు గ్రామాలలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆక్వా రైతులను, బాధితులను పరామర్శించారు. నరసాపురం మండలం చిన్నమైనవాని లంక వద్ద నల్లిక్రిక్ ఉప్పొంగి రోడ్డు కోతకు గురై గండిపడిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా సందర్శించి రైతులతో మాట్లాడారు. సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో చెరువులు పూర్తిగా నీటమునిగి దెబ్బతిన్నాయని రైతులు కలెక్టర్ కు తెలిపారు.

ఈ విషయంమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని కలెక్టర్ (Collector) తెలిపారు. వేముల దేవి ఈస్ట్, వెస్ట్ కుక్కిలేరు వద్ద గట్టు పైనుండి నీరు పొంగి కొంతమేర కరుణానగర్ కాలనీలోకి చొచ్చుకు వచ్చింది. ఈ నీటిని పరిశీలించి, బాధితులను పరామర్శించారు. జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రానికి తరలిరమ్మన్నపుడు ఎందుకు వెళ్లలేదని ప్రశించారు.

ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి అని కాలనీ వాసులని నిలదీశారు. మొంథా తుఫాన్ తీరం దాటినట్లు ప్రకటించిన నరసాపురం మండలం బియ్యపు తిప్ప గ్రామం ప్రాంతాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద బాధితుల్లో ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుందని ఏ విధమైన ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో నరసాపురం ఆర్డీవో దాసిరాజు, తహసిల్దార్ ఐతం సత్యనారాయణ, మత్స్య శాఖ ఎడి ఎల్. ఎల్.ఎన్.రాజు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Leave a Reply