ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

శావల్యాపురం, ఆంధ్రప్రభ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని కారుమంచి, శావల్యాపురం, కనమర్లపూడి తదితర గ్రామాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కనమర్లపూడి గ్రామంలో గుంటూరు-కర్నూలు జాతీయ రహదారి ప్రక్కనున్న ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద తిరునాళ్ళ వేడుకలను భక్తులు మంగళవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే భక్తులు దేవాలయానికి చేరుకొని స్వామివారికి పాలాభిషేకాలు, క్షీరాభిషేకాలు నిర్వహించి నూతనవస్త్రాలు, పూలమాలలతో అందంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు, ఆకుపూజలు చేశారు. మహిళలు దేవాలయ ప్రాంగణంలో పొంగళ్ళు వండి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ఆంజనేయులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలయ కమిటీ సభ్యులు జీవీని సాదరంగా ఆహ్వానించి దుశ్శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవాలయం తరుపున విద్యుత్ ప్రభ నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎస్ఐ మోర్ల వెంకటేష్ బాబు తిరునాళ్ళలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు గోరింట్ల హనుమంతరావు, సొసైటీ చైర్మన్ విశ్వనాధం, డైరెక్టర్ గద్దె వీరమస్తాన్రావు, నేతలు ముక్కపాటి నాగేశ్వరరావు, మర్రి నరేంద్ర, అల్లు వెంకట రాకేష్ పాల్గొన్నారు.

  అదేవిధంగా మండలంలోని కారుమంచి గ్రామం సత్రం సెంటర్లో ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి గుడి వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు కొడవడికంటి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల మందికి అన్నదానం చేశారు.

Leave a Reply