ప్రతి అర్హుడి ఓటు నమోదు చేయాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ–2లకు పిలుపునిచ్చారు.

సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భీమా గార్డెన్‌లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్‌ఏ–2ల సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్ ప్రక్రియ అత్యంత కీలకమని, ప్రతి అర్హ ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి అర్హులైన ఓటర్ల వివరాలు నమోదు చేయాలని చెప్పారు.

నిర్లక్ష్యం కారణంగా అర్హులు ఓటు హక్కు కోల్పోతే అది ప్రజాస్వామ్యానికి నష్టం అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు.

బూత్‌వారీ కార్యాచరణ, ఇంటింటి పర్యటన, కుటుంబాల చెక్‌లిస్ట్ తయారీ, కొత్త ఓటర్ల గుర్తింపు, సవరణలు, బీఎల్‌వోలతో సమన్వయం వంటి అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, కార్యదర్శులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.