ఇంటి మీదకే వంగిన విద్యుత్ స్తంభం
- భయాందోళనలో జంపాల రాజు కుటుంబం..
- వెంటనే తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలో ఓ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఇంటిపైకి పూర్తిగా వంగిపోవడంతో జంపాల రాజు కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ఈ విషయాన్ని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జంపాల రాజు వాపోయారు. ముఖ్యంగా వర్షాకాలంలో స్తంభానికి ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, చిన్నారులు వాటిని తాకితే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని వెంటనే తొలగించి, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.
