Electric Car | టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన వాహనం

Electric Car | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి పలువురు వాహనదారులను ఢీకొట్టిన అనంతరం టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది.

ప్రమాద సమయంలో రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కారు ఢీకొనడంతో పలువురు వాహనదారులు గాయపడినట్లు సమాచారం. ప్రమాద ధాటికి టిఫిన్ సెంటర్ ముందు భాగం ధ్వంసమైంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.