Cm-Cbn-Crackdown : సీబీఎన్​ సీరియస్ Anshra Prabha Top Story

Cm-Cbn-Crackdown : సీబీఎన్​ సీరియస్ Anshra Prabha Top Story

  • లోకల్​ లీడర్లకు క్లాస్
  • కలెక్టర్, ఎస్పీకి గట్టి ఆదేశాలు
  • పీడీ యాక్ట్ హెచ్చరిక
  • మాఫియా సైలెంట్!
  • టిప్పర్లు అదృశ్యం
  • ఎర్రమట్టి దొంగలు పరారీ
  • ఇసుక రాబంధులు మాయం
  • ఊపిరి పీల్చున్న ఊళ్లు
  • అక్రమార్కులపై ఇంటెలిజెన్స్ ఆరా

నిన్న మొన్నటి వరకు భారీ టిప్పర్ల శబ్దాలతో మోతమోగిన పల్లెలు ప్రశాంతంగా మారాయి. గత రెండు రోజులుగా ఏ లారీల జాడ ఏ రోడ్డులోనూ కనిపించడం లేదు. దాంతో గ్రామస్తులు, వాహనచోదకులు, రోడ్లకు ఇరువైపులా దుకాణాలు నిర్వహించే వ్యాపారస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలే!. తమిళనాడుకు ఆనుకొని ఉన్న పాపానికి గత కొన్నేళ్లుగా సత్యవేడు నియోజకవర్గం యంత్రాల మోతలు, టిప్పర్లు, లారీల రణగొణ ధ్వనుల మధ్య నలిగిపోయింది. ఇక్కడ ఉన్న ఎర్రమట్టి పాలకుల పాలిటి బంగారంగా మారింది. సత్యవేడు నియోజకవర్గం నలు మూలల నుంచి లక్షలాది టన్నుల ఎర్రమట్టి తమిళనాడుకు తరలిపోయింది. పగలు రాత్రి తేడా లేకుండా ఈ ఎర్ర మట్టి తరలించే టిప్పర్, లారీలు తాకిడికి జనం బెంబేలెత్తిపోయారు. కానీ సీఎం చంద్రబాబు వార్నింగ్‌తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పల్లెల్లో ప్రశాంతత పరుచుకుంటోంది.

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ)

సత్యవేడు నియోజకవర్గంలో నెలల తరబడి యథేచ్ఛగా సాగిన ఇసుక, ఎర్రమట్టి మాఫియాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్‌తో బ్రేక్ పడిన పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి వరకు తెల్లవారుజాము నుంచే వందలాది టిప్పర్లు గ్రామాల నుంచి తమిళనాడు వైపు దూసుకెళ్లగా, గత రెండు రోజులుగా ఒక్క లారీ కూడా రోడ్లపై కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీసిటీ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు అక్రమ రవాణా, దాని వల్ల ప్రభుత్వానికి వస్తున్న చెడ్డపేరును సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్, ఎస్పీకి ఆదేశించారు. సీఎం హెచ్చరికలతో మాఫియా ఒక్కసారిగా గప్‌చుప్ కావడం, టిప్పర్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Cm-Cbn-Crackdown : తారా స్థాయి దోపిడీ..

నియోజకవర్గ పరిధిలో దాదాపు 30కి పైగా ఎర్రమట్టి క్వారీలు నడిచాయి. ఈ క్వారీల్లో కనీసం పావు వంతు వాటికి కూడా ఎటువంటి అనుమతులు లేవు. అధికారులు, అధికార పార్టీ ప్రతినిధులు వాటాలు వేసుకుని తవ్వుకో… తరలించుకో… మాకు ఇచ్చుకో అనే పద్ధతిన దోపిడీకి తెరదీశారు. చివరకు ఈ మట్టి తరలింపు వ్యవహారం పతాక స్థాయికి చేరిపోయింది. అధికార దర్పం… నజరాణాలు… బెదిరింపు ఆదేశాలకు ఇక్కడి స్థానిక అధికారం యంత్రాంగం కూడా అక్రమాలకే.. సై సై అంటూ తల ఆడించారు. ఎర్రమట్టి దోపిడీ కారణంగా పలు గ్రామీణ రోడ్లు ధ్వంసం అయ్యాయి . పిచ్చాటూరు, నాగలాపురం మండలాల నుంచి ఇసుక తమిళనాడుకు విచ్చలవిడిగా తరలించారు. ఎర్రమట్టి, ఇసుక దోపిడి నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పవనాలు మొదలయ్యాయి.

Cm-Cbn-Crackdown : సీఎం సీబీఎన్​ దృష్టికి

ఈ నేపథ్యంలోనే ఇటీవల సత్యవేడు మండలం సమీపంలోని మాదనపాలెంలో జరిగిన హీరో గ్లోబల్ పార్ట్ స్ యూనిట్‌కు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు దృష్టి్కి ఈ విషయం చేరింది. ఓ ప్రముఖ నాయకుడు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అక్రమ ఇసుక, మట్టి రవాణాను గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మట్టి, ఇసుక మాఫియా కారణంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మధ్య తేడాలు, ప్రజల అభిప్రాయాలను సీఎంకు దృష్టికి తీసుకెళ్లారట. నాయకుల అవినీతి కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. కింది స్థాయిలో జరుగుతున్న విషయాలను పైకి తెలియకుండా అణచి వేస్తున్నారని, ఫలితంగా వాస్తవ పరిస్థితులు మీకు తెలియడం లేదంటూ వివరించారు.

Cm-Cbn-Crackdown : సీఎం కన్నెర్ర

విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు పార్టీ నేతలు, అధికారుల తీరుపై తీవ్రంగా స్పందించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడులను పిలిపించి.. అక్రమ క్వారీలు, అక్రమ మట్టి, ఇసుక రవాణాలపై కఠినమైన చర్య చేపట్టాలని ఆదేశించారు. అక్రమ రవాణా చేసి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలంటూ సత్యవేడు టీడీపీ నాయకుల సమక్షంలో ఎస్పీ సుబ్బరాయుడును ఆదేశించారు. స్థానిక అవసరాలకు తప్ప.. ఇతర రాష్ట్రాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై నియోజకవర్గం నుంచి తట్ట మట్టి, ఇసుక తరలించడానికి వీల్లేదని, మట్టి, ఇసుక మాఫియాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వానికి, తనకు చెడ్డపేరు తీసుకొచ్చే ఏ పనులను తాను సహించనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే స్థానిక నేతలకు సైతం సీఎం క్లాస్ తీసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీని నాశనం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Cm-Cbn-Crackdown : జనం హర్షాతిరేకం

సీఎం ఆదేశాలతో గత రెండు రోజులుగా సత్యవేడు నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి తరలింపు పనులు ఆగిపోయాయి. దాంతో ప్రధానంగా కన్నవరం, అలిమేలు మంగాపురం, వెంకట రాజుల కండ్రిగ, మదనంచేరి, దాసు కుప్పం, కువ్వకులి, బత్తుల వల్లం, రాచర్ల గ్రామాలతో పాటు బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో 9 గ్రామాలు, పిచ్చాటూరు మండలంలో 13 గ్రామాలు, కేవీపీ పురంలో 08 గ్రామాలు సంబరాల్లో మునిగిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న దోపిడీని అడ్డుకున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆనందం అయితే చెప్పతరం కాదు. చంద్రబాబు తాత లారీలు ఆపేశారు.. ట్రాఫిక్ లేదు.. ఏం లేదు.. మా బస్సులు అన్నీ సకాలంలో పాఠశాలలు, కళాశాలకు వెళ్తున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Cm-Cbn-Crackdown : అధికారుల్లో చలనం

సత్యవేడు నియోజకవర్గంలో చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమ ఇసుక, ఎర్రమట్టి తరలింపుల వ్యవహారంపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. తమ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపై ప్రజలు పలుమార్లు గొంతెత్తినా, అధికారులకు వరుసగా వినతిపత్రాలు సమర్పించినా పెద్దగా స్పందన కనిపించలేదు. కానీ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీపై కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించడంతో అధికారుల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశించడంతో నియోజకవర్గ పరిధిలో అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Cm-Cbn-Crackdown : ఇంటలిజెన్స్ ఆరా..

సత్యవేడు ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మట్టి తరలింపుల వ్యవహారంపై ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ రవాణా వెనుక రాజకీయ నాయకుల పాత్ర ఉందా? స్థానిక అధికారుల సహకారం ఎంతవరకు ఉంది? ఈ వ్యవహారం ఎవరి కన్నుసన్నల్లో నడిచింది? అనే కోణాల్లో లోతుగా విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా క్వారీల నిర్వహణ, అనుమతులు, రవాణా మార్గాలు, సంబంధిత వ్యక్తుల పాత్రపై సమగ్ర సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Cm-Cbn-Crackdown : ప్రశాంతంగా బడికి వెళ్తున్నాం

పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే వరకు తల్లి తండ్రుల్లో ఆందోళన ఉండేది. టిప్పర్ల కారణంగా ఎప్పుడు మాకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియక బయపడుతుండేవారు. రెండు రోజులుగా టిప్పర్లు రాకపోకలు ఆగిపోయాయి. దీంతో ప్రశాంతంగా పాఠశాలకు వెళ్లిరాగలుగుతున్నాం. థాంక్యూ చంద్రబాబు తాతయ్య.

సంతోష్, పదవ తరగతి విద్యార్థి, సత్యవేడు

Cm-Cbn-Crackdown : దుకాణలు దుమ్ముకోట్టుకుపోయేవి

మట్టి లారీలు వందల సంఖ్యలో తిరుగుతుందడంతో మా దుకాణలు పూర్తిగా దుమ్ముతో నిండిపోయేవి. బయట కూర్చోడానికి బయపడేవాళ్లం. దుమ్ము ధూళితో సాయంత్రం వరకు భరించాల్సి వచ్చేది రెండురోజులుగా మట్టి లారీలు పట్టణంలోకి రాకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నాం.

రమాదేవి, స్థానిక దుకాణం యజమాని, సత్యవేడు

Cm-Cbn-Crackdown : పల్లెల్లో రోడ్లు ధ్వంసం

టిప్పర్ల కారణంగా గ్రామాల రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. నిత్యం గ్రామాల నుంచి పట్టణానికి రావాలన్న పరిశ్రమలకు వెళ్లాలన్నా లారీల కారణంగా అనేక ప్రమాదలకు గురయ్యేవారు. ముఖ్యమంత్రి చొరవతో శాశ్వతంగా మట్టి మాఫియా వెనక్కి వెళ్లడంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయానికి ధన్యవాదాలు.

మౌనరాజ్, స్థానికుడు, సత్యవేడు