విద్యతోనే ఉన్నత ఉపాధి అవకాశాలు..
- జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ
- ప్రతిభను ప్రోత్సహించడమే ప్రదాన లక్ష్యం
- జాతీయ జర్నలిస్టులసంఘం కార్యదర్శి గంట్ల
అక్కయ్యపాలెం జంక్షన్, ఆంధ్రప్రభ : ప్రస్తుత సమాజంలో విద్యతోనే అపారమైన ఉన్నత ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని, కోరుకున్న రంగంలో రాణించడానికి విద్య ఎంతగానో దోహదపడుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ర్ట నాయకులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఆదివారం అక్కయ్యపాలెం కార్యాలయంలో పలువురు జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు, నగదు బహుమతులు, ఇతర కానుకలు గంట్ల శ్రీనుబాబు చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 28న విఎంఆర్ డిఏ బాలల ప్రాంగణంలో సుమారు 152 మంది జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు, నగదు బహుమతులు అందజేసామన్నారు. అయితే ఆ తరువాత కూడా పలువురు జర్నలిస్టుల పిల్లల ప్రతిభాపాటవాలను గుర్తించి వారిని ప్రోత్సహించాలని సంకల్పించడం జరిగిందన్నారు.

అందులో భాగంగానే నలుగురు బీటెక్ విద్యార్ధులకు మూడేళ్ల ఫీజులు చెల్లించడం జరిగిందన్నారు. అలాగే మరికొంత మంది ఇంటర్ విద్యార్ధుల ఫీజులు చెల్లించామన్నారు. జర్నలిస్టుల పిల్లల్లో అత్యంత ప్రతిబావంతులున్నారని అయితే వారిని ప్రోత్సహించాలని సంకల్పంగా నిర్ణయించుకొని నిరంతరం అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎంతో మంది ఉన్నత విద్యాభ్యాసం సాగించి ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్న జర్నలిస్టుల పిల్లలు నేటికి తమ పట్ల ఎంతో ఆదరణతో మర్యాదపూర్వకంగా ఉన్నారన్నారు. తాము ఇచ్చిన ప్రోత్సాహం వారికి చిరకాలం గుర్తుందన్నారు. జర్నలిస్టుగా తన పరిది మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు సాగడం జరుగుతుందన్నారు.
ఐదుగురు విద్యార్ధులకు విద్యాప్రోత్సాహకాలు

తాజాగా ఆదివారం ఐదుగురు జర్నలిస్టులు పిల్లలకు (విద్యార్ధులకు) గంట్లశ్రీనుబాబు విద్యాప్రోత్సాహకాలు అందజేశారు. అందులో ఇంటర్ విద్య పూర్తి చేసిన మహ్మద్ కైరాసుద్దీన్ , ఇంటర్ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అగ్నివీర్ కు సిద్ధమవుతున్న బి.దేవిశ్రీసాహితీ , బి.సంజన (ఇంటర్ ద్వితీయసంవత్సరం), ఈ.నిషిక (ఇంటర్), ఎమ్.లోచన్ ప్రహాన్ నాయుడు (యుకెజి)లకు విద్యాప్రోత్సాహకాలు స్వీకరించిన వారిలో ఉన్నారు. వీరంతా ఉన్నతంగా విద్యాభ్యాసం సాగించి మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు.
