16వ వార్డులో డోర్ టు డోర్..
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య పట్టణంలోని 16వ వార్డులో డోర్ టు డోర్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదని పట్టణంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కార మార్గం చూపాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విద్యుత్ సమస్య, త్రాగునీరు సమస్య డ్రైనేజీ పారిశుధ్యం వంటి వాటిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి డీఈ నాసిర్ ఏఈ దినేష్‌లకు సూచించారు.
అభివృద్ధి అంటే టీడీపీ విధ్వంసం అంటే వైసీపీ అని ఎమ్మెల్యే జయసూర్య స్పష్టం చేశారు. గత ఎన్నో సంవత్సరాలుగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న దినసరి కూలీ వేతనం కింద ఉన్న పారిశుద్ధ కార్మికులకు రోజుకు 300 నుంచి నెలకు 15,000 చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనని, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు.2014 టీడీపీ ప్రభుత్వంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని అప్పటి టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు వెడల్పు, డివైడర్ సెంట్రల్ లైటింగ్ పనులకు ప్రపోజల్ పంపించడం జరిగిందన్నారు.
అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పనులను పూర్తిగా నిలిపివేసిన ఘనత వైసీపీదేనని ఆయన విమర్శించారు. ఎస్టీ ప్లాన్ కింద చిన్న చిన్న డ్రైనేజీలు, వివిధ రకాల పనులను ప్రస్తుతం పూర్తి చేస్తున్నామని తెలిపారు.ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అధికారం శాశ్వతం కాదు, అభివృద్ధి శాశ్వతం అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. నందికొట్కూరు పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
