వశిష్ఠ గోదావరికి వరద ముప్పు.. అధికారుల అలర్ట్

  • భద్రచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
  • ఫెర్రీ, పడవలపై రాకపోకలు బంద్.
  • ఆర్డీఓ దాసి రాజు

నర్సాపురం, ఆంధ్రప్రభ: భద్రాచలం వద్ద గోదావరి నదీ నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నర్సాపురం వశిష్ఠ నదికి వరద నీరు పోటెత్తడం తో గోదావరి ఎరుపెక్కింది. ఎర్రనీరు పొంగి ప్రవ హించడం తో అధికారులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం సాయంత్రం నర్సాపురం ఆర్ డి ఓ దాసి రాజు పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ను అప్రమత్తం చేశారు.

నదీ తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున నర్సాపురం వశిష్ఠ గోదావరి నది కి వరద వచ్చే అవకాశం ఉందన్నారు. గనుక ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నర్సాపురం మండలాల్లోని గోదావరి నదీ తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉండాలని సూచించారు. నర్సాపురం, దొడ్డిపట్ల ప్రాంతాల్లో గోదావరి నది పై జరిపించే ఫెర్రీ రాకపోకలను తక్షణమే నిలిపి వేయాలని, అలాగే అనధికారికంగా ఎక్కడైనా పడవ ప్రయాణాలు జరిగితే వాటిని కూడా నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వరద ఉదృతి మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం కూడా ఉన్నందున రానున్న రెండు రోజులు చాలా కీలకం కానున్నాయని, మత్స్య కారులు గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. నదీ తీర ప్రాంతాల్లో టామ్ టామ్ వేసి ప్రజలకు వరద ఉదృతి సమాచారం తెలిజేయాలని సూచించారు. రెవెన్యూ సిబ్బంది, అధికారులు అందుబాటులో ఉండాలని, నదీ తీరంలో గస్తీ తిరిగి ఎప్పటి కప్పుడు సమాచారం ను తెలియజేయాలని తెలిపారు.

ఫెర్రీ రాకపోకలు బంద్..

వరద ఉదృతి కారణంగా గోదావరి నది పై ఫెర్రీ, పడవలు ద్వారా జరిపే రాకపోకలను అధికారులు నిలిపేశారు. నర్సాపురం లోని మాధవాయపాలెం ఫెర్రీ రేవు వద్ద, దొడ్డిపట్ల ఫెర్రీ రేవు లలో రెండు రోజులు పాటు నది ప్రయాణం చేయరాదని ఆర్ డి ఓ దాసి రాజు అధికారులను ఆదేశించారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందని, మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యే అవకాశం ఉన్నందున గోదావరి నదీ పై ఎటువంటి రాకపోకలు జరపరాదని , అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ఫెర్రీ రేవు ల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ యంత్రాంగం నది తీరంలో గస్తీ తిరుగుతున్నారు. గోదావరి ఏటిగట్టు పరిస్థితి పై ఆరా తీస్తున్నారు. అవసరం అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీఓ దాసి రాజు తెలిపారు.