తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : అదనపు కలెక్టర్ రాములు
చెన్నూర్, ఆంధ్రప్రభ : రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ అదనపు కలెక్టర్ రాములు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని కొందరు చేస్తున్న ప్రచారాలను రైతులు నమ్మవద్దని సూచించారు.
శుక్రవారం స్థానిక మార్కెట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భద్రపరిచే సామర్థ్యం గల గోదాములు ఉన్నాయని తెలిపారు. అదనంగా పెద్దపల్లి జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నులు, కరీంనగర్ జిల్లాలో మరో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు.
2025-26 సంవత్సరంలో ఇప్పటివరకు 87,825 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత లేదని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో హమాలీల కొరత ఉన్నా, బీహార్‌కు చెందిన కార్మికులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
తప్పుడు ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వెంటనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రైతులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ మల్లికార్జున్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
