polling | 24 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల

polling | 24 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల
జూన్ ఒకటో తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ
18న పోలింగ్,ఆదే రోజు కౌంటింగ్
polling | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 4 స్థానాలతో పాటు గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్లు లెక్కిస్తారు. జూన్1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీ కాగా జూన్ 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్ 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని వివరించింది. జూన్ 18వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాన్ని ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గుజరాత్‌లో 4, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్‌లో 3, రాజస్థాన్‌లో 3, జార్ఖండ్‌లో 2 స్థానాలతో పాటు మణిపూర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరంలో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీలో నాలుగు స్థానాలకు…
వాటితో పాటూ ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. జూన్ 21వ తేదీతో వైసీపీ నుంచి ఎంపికైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు టీడీపీ నుంచి ఎంపికైన సానా సతీష్ పదవీ కాలం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలోని పార్టీలకు 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దాంతో ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమి కైవసం చేసుకోనుంది.
