బాసరలో భక్తుల రద్దీతో కిక్కిరిసిన ఆలయం

బాసరలో భక్తుల రద్దీతో కిక్కిరిసిన ఆలయం

బాసర, నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఆదివారం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రాకతో ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో “ఓం ఐం సరస్వత్యై నమః” నినాదాలతో మారుమోగాయి.

భక్తులు గోదావరి పుణ్యనదిలో స్నానాలు ఆచరించి, నది తీరంలోని సూర్యేశ్వర ఆలయంలో అభిషేకాలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికమాసాన్ని పురస్కరించుకుని గోదారమ్మకు పిండి పదార్థాలు సమర్పించి తెప్పలు వదిలి భక్తులు పూజలు నిర్వహించారు.

అనంతరం అమ్మవారి సర్వదర్శనం, ప్రత్యేక దర్శన క్యూలైన్లు భక్తులతో బారులు తీరాయి. సర్వదర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రత్యేక దర్శనం కోసం రూ.100 టికెట్లు జారీ చేసినప్పటికీ, భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో గంటకు పైగా టికెట్ జారీని తాత్కాలికంగా నిలిపివేశారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ సన్నిధిలోని అక్షరాభ్యాస మండపంలో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఆలయ అన్నదాన సత్రంలో ప్రసాదాన్ని స్వీకరించారు. అంచనాలకు మించి భక్తులు రావడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సుమారు 40 వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాలు, ప్రత్యేక దర్శనం, అక్షరాభ్యాస పూజలు తదితరాల ద్వారా ఆలయానికి సుమారు రూ.15 లక్షలకుపైగా ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.

Leave a Reply