బంగారం కొనొద్దన్న పిలుపుతో స్వర్ణకారుల బంద్..

బంగారం కొనొద్దన్న పిలుపుతో స్వర్ణకారుల బంద్..

రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు మూసివేత
విజయవాడలో కార్యాలయాల ఎదుట నిరసనలు
ఆర్డర్లు లేక ఉపాధి కోల్పోయామని ఆవేదన
ప్రత్యేక నిధులతో ఆదుకోవాలని డిమాండ్

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన బంగారం కొనుగోళ్ల నియంత్రణ పిలుపుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణకారులు మంగళవారం బంద్‌కు దిగారు. విజయవాడ సహా పలు పట్టణాల్లో బంగారు దుకాణాలు మూసివేసి స్వర్ణకార సంఘాల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్వర్ణకారుల సంఘం నేతలు మాట్లాడుతూ ఇప్పటికే అంతంతమాత్రంగానే జీవనోపాధి కొనసాగుతోందని, తాజాగా బంగారం కొనుగోళ్లపై ప్రజల్లో అనిశ్చితి పెరగడంతో పూర్తిగా ఆర్డర్లు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ఐదు కాసుల బంగారం పనికి ఐదు వేల రూపాయల వరకు ఆదాయం వచ్చేది.

ఇప్పుడు బంగారం ధరలు పెరుగుతాయో తగ్గుతాయో తెలియక వినియోగదారులు కొనుగోళ్లు మానేశారు. దీంతో తయారీ పనులు పూర్తిగా దెబ్బతిన్నాయి” అని పేర్కొన్నారు. ప్రధాని పిలుపు ఇవ్వడానికి ముందు స్వర్ణకార వర్గాలతో చర్చించి ఉండాల్సిందని వారు విమర్శించారు. “సంవత్సరం పాటు బంగారం కొనొద్దని చెబితే మా కుటుంబాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. స్వర్ణకార కుటుంబాల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రత్యేక ఆర్థిక నిధులు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.