మేనేజర్ కుర్చీలో వార్డు ఆఫీసర్..!

మేనేజర్ కుర్చీలో వార్డు ఆఫీసర్..!

  • అచ్చంపేట మున్సిపాలిటీలో కమిషనర్ అధికార దుర్వినియోగమా..?
  • ఖాళీ పోస్టుకు ఇన్‌చార్జి నియామకంపై విమర్శలు
  • సీనియర్ అధికారులను పక్కన పెట్టి వార్డు ఆఫీసర్‌కే బాధ్యతలు
  • మేనేజర్ ఛాంబర్‌లో కూర్చొని విధులు నిర్వహిస్తున్న వార్డు ఆఫీసర్ గణేష్
  • మున్సిపల్ కార్యాలయంలోనే అసంతృప్తి చర్చనీయాంశం

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట పురపాలక సంఘం కార్యాలయంలో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టు వ్యవహారం ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాలపై అధికార వర్గాలతో పాటు ప్రజల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పురపాలక సంఘ కార్యాలయంలో మేనేజర్ రమేష్ నాయక్ డిప్యూటేషన్ పై వెళ్లడంతో మేనేజర్ పోస్టు ఖాళీగా ఉన్నది. ఆ బాధ్యతలను వార్డు ఆఫీసర్ గణేష్‌కు ఇన్‌చార్జి మేనేజర్‌గా అప్పగించడం ఒక ఎత్తయితే, ప్రస్తుతం గణేష్ మేనేజర్ ఛాంబర్‌లోని కుర్చీలో కూర్చొని విధులు నిర్వహించడం మరో ఎత్తుగా మారింది.

ఈ వ్యవహారం కార్యాలయ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తికి దారితీసినట్లు సమాచారం. సాధారణంగా మేనేజర్ స్థాయి బాధ్యతలను సీనియర్ ఉద్యోగులకు లేదా సంబంధిత విభాగ అధికారులకు అప్పగించడం పరిపాటి. పైస్థాయి అధికారుల అనుమతులు, సిడిఎంఏ ఉత్తర్వులు వంటి విధి విధానాలు పాటించాల్సి ఉండగా, వాటిని పక్కన పెట్టి వార్డు ఆఫీసర్‌కు బాధ్యతలు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

“కార్యాలయంలో సీనియర్ సిబ్బంది ఉండగానే వార్డు ఆఫీసర్‌కు మేనేజర్ బాధ్యతలు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి?” అని ఉద్యోగులే గుసగుసలాడుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు అయితే ఇది కమిషనర్ అధికార దుర్వినియోగానికి నిదర్శనమని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, అధికార పరిమితులను దాటి వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో ఈ ఘటన అచ్చంపేట పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

పాలన సౌలభ్యం కోసమే బాధ్యతలు అప్పగించడం జరిగింది
మున్సిపల్ కమిషనర్ డి. మురళి

పరిపాలన సౌలభ్యం కోసమే ఖాళీగా ఉన్న మేనేజర్ స్థానంలో వార్డ్ ఆఫీసర్ను ఇంచార్జ్గా నియమించడం జరిగింది అంతే తప్ప ఉన్న మేనేజర్ ను పక్కకు తప్పించి వార్డు ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న గణేష్ కి బాధ్యతలు అప్పగించలేదు. సరైన స్టాప్ లేనందున ఎవరినైనా నియమించుకోవచ్చు. ఆర్ ఐ, ఆర్వో, సి సెక్షన్లలో ఎవరు లేరు, వార్డు ఆఫీసర్లను పెట్టుకొని పని చేయించుకుంటున్నాను.

Leave a Reply