Eluru | ఆనందోత్సాహాలతో సంక్రాంతి

Eluru | ఆనందోత్సాహాలతో సంక్రాంతి
Eluru | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చెడును పారద్రోలి మంచి మనసులతో ప్రజలంతా నూతన కాంతులతో సంక్రాంతి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటిచంటి అభిలాషించారు. ఇదేక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు అంబరాన్నం టాయని ఎమ్మెల్యే బడేటి పేర్కొన్నారు. ఏలూరు నగర సంక్రాంతి సంబరాలను శనివారపు పేటలో ఈ రోజు అట్టహాసంగా నిర్వహించారు.
రంగవల్లుల పోటీలు, కోలాట నృత్యాలు, సంప్రదాయ కోడిపందాలు, ఎడ్లబండ్లు, గంగిరెద్దుల విన్యాసాలతో ప్రాచీన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ వేడుకల్లో టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు, మాజీ మంత్రి మాగంటి బాబు, పద్మవల్లి దేవి దంపతులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈక్రమంలో సంబరాలు జరిగిన ప్రాంతానికి గ్రామీణ వాతావరణాన్ని తలపింపచేసే తరహాలో ఎడ్ల బండిపై చేరుకున్న ఎమ్మెల్యే చంటి దంపతులకు, టీడీపీ నాయకులు, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం పండుగ సంబరాలకు నాందిపలుకుతూ భోగి మంటను వెలిగించారు. రంగవల్లులను తిలకించారు. సరదాగా కొద్దిసేపు డింకీ కోడిపందాలు వేసి అందర్నీ ఉత్సాహపరిచారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేసి, అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తోన్న మంచికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రభుత్వాధినేతల బాధ్యతలో సమిష్టిగా పాలుపంచుకోవాలని సూచించారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, పార్టీ జిల్లా మీడియా కో- ఆర్డినేటర్ చల్లా వెంకటసత్యవర ప్రసాదరావు, కో- ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, నాయకులు బెల్లపుకొండ కిషోర్, మాజీ వైస్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు వివిధ హోదాలో ఉన్న కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
