అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం
అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం
ఉమ్మడి వరంగల్/ ఉమ్మడి నల్లగొండ, ఆంధ్రప్రభ బ్యూరో : గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాలవర్షాలతో తడిసి ముద్దయిందని అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని 20 రోజులైనా కాంటాలు వేయకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే అకస్మాత్తుగా వచ్చిన గాలివానతో అటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇటు మక్కల కొనుగోలు కేంద్రాల్లో పోసిన రాశులు పూర్తిగా తడిసిపోయాయని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన అకాల వర్షానికి ఎక్కడికక్కడే ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి.
మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట, కురవి, బయ్యారం, మరిపెడ, చిన్నగూడూరు, నెల్లికుదురు మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో ధాన్యం రాశులు తడిసిపోగా, కోయని పంట పొలాలు నేలకొరిగిపోయాయి. ములుగు జిల్లాలోని తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల్లో వర్షానికి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. కురవి మండల కేంద్రంలో వర్షపునీటిలో ధాన్యం కొట్టుకుపోతుండటంతో కాలువలు తీస్తూ ఏమీ చేయలేని దయనీయ పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేలవాలిన మొక్కజొన్న, వరిపంటలు బలమైన ఈదురుగాలులతో కోతకొచ్చిన వరి పంట నేలకు వాలిపోగా, మొక్కజొన్న పంట కూడా పూర్తిగా నేలకువాలిందని రైతులు చెబుతున్నారు.
పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి రైతులపై పగబట్టినట్లుగా అకాల వర్షాలు కురుస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కళ్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని, మక్కలను దగ్గరికి చేసే వ్యవధి లేకపోవడంతో అకాలవర్షానికి తడిసి ముద్దయిందంటూ రైతులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం, మక్క రాశులపై కప్పేందుకు టార్పాలిన్ కవర్లు లేకపోవడం వల్ల భారీగా నష్టపోయామని రైతులు వాపోయారు. కనీసం వచ్చిన ధాన్యం వచ్చినట్లుగా కాంటాలు వేసి, మిల్లులకు తరలిస్తే ఇంత నష్టం జరిగేది కాదని ఆవేదన వ్యక్తంచేశారు. మరోపక్క మామిడితోటల్లో కాయలు నేలరాలిపోయాయని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందలాది ఎకరాల్లో మామిడితోటలు దెబ్బతినగా, వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు. నకిరేకల్లో నేలకొరిగిన చెట్లు, విద్యుతంభాలు నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులు, అకాల వర్షం పెను బీభత్సాన్ని సృష్టించాయి. నల్లగొండ, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల పరిధిలో ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. నకిరేకల్ పట్టణంలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నల్లగొండ పట్టణంలో ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. ఆర్జాలబావి వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
కొంత మంది ధాన్యం రాశులపై టార్పాలిన్ పట్టాలను కప్పుకొని ధాన్యం తడవకుండా జాగ్రత్త పడ్డారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, త్రిపురారం, నిడుమనూరు, గుర్రంపోడు మండలాలలో ఈదురుగాలులు పెను బీభత్సం సృష్టించాయి. రోడ్డుపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. గుర్రంపోడు మండలం కోనయ్యగూడెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురు గాలులతో జిల్లాలోని మామిడి తోటలకు భారీ నష్టం కలిగింది. వడగండ్ల వానకు, ఈదురు గాలులకు మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
