పౌర్ణమి రోజు పోటెత్తిన భక్తులు..

పౌర్ణమి రోజు పోటెత్తిన భక్తులు..

తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భారీ క్యూలు..
రూ.500 దర్శనం టికెట్ల విక్రయాలు తాత్కాలికంగా నిలిపివేత..
విఐపి ప్రోటోకాల్ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్..
బంగారు వాకిలి ద్వారా భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు
ఘాట్‌రోడ్‌లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు, బస్సుల్లో కిటకిటలాడిన రద్దీ

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, దర్శనం కోసం క్యూలైన్లు నిండిపోయాయి. పెరిగిన రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు రూ.500 ప్రత్యేక దర్శనం టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి, బంగారు వాకిలి ద్వారా భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కె. శీనా నాయక్ దంపతులు కూడా సాధారణ భక్తుల మాదిరిగానే గర్భగుడి వెలుపల నుంచే అమ్మవారిని దర్శించుకుని ముందుకు సాగడం విశేషంగా నిలిచింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఘాట్‌రోడ్, కనకదుర్గానగర్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దేవస్థానం ప్రత్యేక బస్సులతో పాటు ఆర్టీసీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, బస్టాండ్‌ల నుంచి నడిపిన సర్వీసులు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో నిర్వహించిన అన్ని ఆర్జిత సేవల్లోనూ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందారు. పౌర్ణమి వేళ ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తిశ్రద్ధలతో నిండిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.