న్యూఢిల్లీ : దేశ భద్రతకు తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా సేవలందించిన భారత సైనికులను సత్కరించేందుకు… కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను అందజేస్తుంది. ఈ సందర్భంగా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో శౌర్య పురస్కారాల ప్రదానోత్సవం నేడు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిద సైన్యాధినేతలతో సహా.. ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ విభాగాల్లో దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు రాష్ట్రపతి శౌర్య అవార్డులు ప్రదానం చేశారు.
మేజర్ రామ్ గోపాల్ కు “శ్రీచక్ర”
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా వాసి, భారత సేనకు చెందిన మేజర్ మళ్ళ రాం గోపాల్ నాయుడు అత్యంత గౌరవనీయమైన “కీర్తి చక్ర” పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులతో పోరాడటంలో, తోటి సైనికులను రక్షించడంలో, ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఆయన చూపిన ధైర్యసాహసాలకు గాను ఆయనకు ఈ అవార్డు అందుకున్నారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవం దేశం కోసం త్యాగం చేసిన సైనికుల సేవలను స్మరించుకోవడమే కాకుండా, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది.
