విద్యుత్ కార్యాలయాల వద్ద నీటి కేంద్రాల ఏర్పాటు…

విద్యుత్ కార్యాలయాల వద్ద నీటి కేంద్రాల ఏర్పాటు…
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు జిల్లా వ్యాప్తంగా తాగునీటి వసతుల ఏర్పాటు
కలెక్టర్ ఆదేశాలతో విద్యుత్ కార్యాలయ సందర్శకులకు ఉపశమనం
విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) అధికారులు వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యుత్ కార్యాలయాల వద్ద నీటి కేంద్రాలను (చలివేంద్రాలను) ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాలో భాగంగా, విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఏపీసీపీడీసీఎల్ ఎన్టీఆర్ జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయం వెలుపల మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఇతర సేవల కోసం కార్యాలయాలకు వచ్చే సందర్శకులు, వినియోగదారులు, అలాగే అటుగా వెళ్లే బాటసారులకు సురక్షితమైన తాగునీటిని అందించే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఏపీసీపీడీసీఎల్ విజయవాడ టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వై. కొండలరావు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమానికి తమ శాఖ కట్టుబడి ఉందని, వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ప్రజలు డీహడ్రేషన్ (dehydration) సమస్యలకు గురికాకుండా చూసేందుకు ఈ చర్య తీసుకున్నామని తెలిపారు. ఒక సమన్వయ ప్రయత్నంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు విద్యుత్ కార్యాలయాల వద్ద కూడా ఇటువంటి చలివేద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న వడగాలుల నేపథ్యంలో, ప్రజల సౌకర్యం, ఆరోగ్యంపై ప్రభుత్వ యంత్రాంగం చూపుతున్న శ్రద్ధకు ఈ కార్యక్రమం నిదర్శనమని కొండలరావు అభిప్రాయపడ్డారు. ప్రజలు ఈ వసతులను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే తగినంత నీరు తాగుతూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చూసేందుకు, ఈ నీటి కేంద్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. వేసవి కాలంలో ప్రజల అవసరాలను తీర్చడంలో జిల్లా యంత్రాంగం, ఏపీసీపీడీసీఎల్ తీసుకున్న చర్యలను ప్రజలు అభినందిస్తూ, ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ డీ2 బసవరాజు, గవర్నర్‌పేట ఏఈ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
