న్యాయవాదిపై పోలీసుల కేసు..

భగ్గుమన్న బార్ అసోసియేషన్

రెండు రోజుల పాటు కోర్టు విధుల బహిష్కరణ..

కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్

దమ్మపేట, ఆంధ్రప్రభ: దమ్మపేటలో న్యాయవాదిపై పోలీసులు నమోదు చేసిన కేసును నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. సివిల్ వివాదాల్లో పోలీసులు అతిగా జోక్యం చేసుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గురు, శుక్రవారాల్లో కోర్టు విధులను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

దమ్మపేట రెవెన్యూ మౌజా పరిధిలోని 273/1 సర్వే నంబర్‌కు సంబంధించిన సివిల్ వివాదంలో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోవడమే కాకుండా, స్థానిక న్యాయవాది గోళ్ల భవాని కృష్ణ యాదవ్‌పై అక్రమంగా కేసు నమోదు చేశారని బార్ అసోసియేషన్ ఆరోపించింది.

దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద గురువారం మీడియాతో మాట్లాడిన న్యాయవాదులు, సివిల్ స్వభావం ఉన్న కేసుల్లో చట్టప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ స్థానిక పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు.

ఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు జరగకపోయినా, కొందరి ఫిర్యాదు ఆధారంగా కనీస విచారణ కూడా చేపట్టకుండా న్యాయవాది గోళ్ల భవాని కృష్ణ యాదవ్‌పై ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేసి వేధించడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

న్యాయవాదిపై నమోదు చేసిన కేసును ఛార్జ్‌షీట్ దాఖలు చేయకముందే వెంటనే ఉపసంహరించుకోవాలని పోలీసు శాఖను డిమాండ్ చేశారు. కేసు విచారణను చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు.

లేనిపక్షంలో దమ్మపేట పోలీసుల తీరుపై హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించడంతో పాటు మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

నిరసన కార్యక్రమంలో దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి లక్కినేని నరేంద్రబాబు, ఉపాధ్యక్షుడు ముప్పిడి శ్యామ్ సుధాకర్, ఉడతనేని శ్రీనివాసరావు, మారం సతీష్‌కుమార్, కాలం సంధ్యారాణి, తామ బాలరాజు, నల్లపు ఉదయ్‌కుమార్, గద్దల అప్పారావు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.