మత్తుకు దూరం.. ఆటలకు చేరువ
- డీ-అడిక్షన్ కేంద్రాలకు క్యారమ్ బోర్డుల పంపిణీ
- బాధితుల మానసిక ఉల్లాసానికి ఇండోర్ గేమ్స్ ఉపయోగపడతాయన్న టౌన్ ఏసీపీ రమణ మూర్తి
- పునరావాసంతో పాటు జీవనశైలిలో మార్పే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
ఖమ్మం, ఆంధ్రప్రభ : మత్తు పదార్థాలకు బానిసైన వారిని సాధారణ జీవనంలోకి తీసుకురావడంలో కౌన్సెలింగ్‌తో పాటు ఇండోర్ క్రీడలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని డీ-అడిక్షన్, పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులకు శనివారం క్యారమ్ బోర్డులను పంపిణీ చేశారు.
పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన బాధితుల్లో మానసిక ఉల్లాసం పెంపొందించడమే దీని ఉద్దేశమని తెలిపారు. చికిత్సతో పాటు వినోదాత్మక కార్యక్రమాలు వారిలో సానుకూల మార్పును తీసుకొస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం పునరావాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
ఈ సందర్భంగా ఏసీపీ రమణ మూర్తి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు బాధితులను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యమన్నారు. అందుకే డీ-అడిక్షన్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. బాధితులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్యారమ్ బోర్డులు, ఇతర ఇండోర్ గేమ్స్‌ను అందజేస్తున్నట్లు వివరించారు.
ఇలాంటి కార్యక్రమాలు వారి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతాయని చెప్పారు. కుటుంబ సభ్యుల సహకారం కూడా పునరావాసంలో కీలకమని సూచించారు. సమాజం కూడా వారిని ఆదరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీసీఆర్‌బీ ఏసీపీ సాంబరాజు, ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ, ప్రభుత్వ వైద్యులు, కౌన్సెలింగ్ బృందం సభ్యులు పాల్గొన్నారు.
బాధితులతో అధికారులు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చికిత్సతో పాటు మానసిక ధైర్యం కల్పించే చర్యలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.
