Uttarakhand| కేదార్‌నాథ్‌కు తగ్గిన ర‌ద్దీ

Uttarakhand| కేదార్‌నాథ్‌కు తగ్గిన ర‌ద్దీ

భారీ వర్షాల ఎఫెక్ట్..
వర్షాలు, కొండచరియల ప్రమాద హెచ్చరికలతో యాత్ర వాయిదా వేసుకుంటున్న భక్తులు
రోజుకు 6 వేల నుంచి 1,000–1,500 మందికి పడిపోయిన దర్శనాలు..
ఇప్పటివరకు 14 లక్షల మంది స్వామి దర్శనం

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ (ఐఎండీ) జారీ చేసిన హెచ్చరికల ప్రభావంతో ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ యాత్రపై తీవ్ర ప్రభావం పడింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం, రహదారుల పరిస్థితిపై ఆందోళనల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తమ యాత్రను వాయిదా వేసుకుంటున్నారు.

ఇటీవలి వరకు రోజుకు సుమారు ఆరు వేల మంది భక్తులు కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకోగా, ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యి నుంచి వెయ్యిన్నర మందికి మాత్రమే పరిమితమైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అధికారులు కూడా యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అయితే ఈ ఏడాది యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 14 లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్ స్వామిని దర్శించుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాత్రకు వెళ్లే భక్తులు అధికారిక వాతావరణ హెచ్చరికలు, ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మార్గాల పరిస్థితి, యాత్ర నిర్వహణకు సంబంధించిన తాజా సమాచారం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం, చార్‌ధామ్ యాత్ర అధికారిక వేదికలను పరిశీలించిన తర్వాతే ప్రయాణం ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.