Snake | టీటీడీ ఉద్యోగి సాహసం…

Snake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుమలలో తొమ్మిది అడుగుల పొడవున్న జెర్రిపోతు (పాము) కలకలం రేపింది. నారాయణగిరి ఉద్యానవన షెడ్ల సమీపంలో భారీ పాము కనిపించడంతో అక్కడున్న ఉద్యోగులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న టీటీడీ ఉద్యోగి భాస్కర్ నాయుడు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జెర్రిపోతు ఆయన కాలుకు చుట్టుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. అయితే ఏమాత్రం బెదరకుండా భాస్కర్ నాయుడు పామును అదుపులోకి తీసుకుని సురక్షితంగా విడిపించుకున్నారు.

అనంతరం పామును అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భాస్కర్ నాయుడు చూపిన ధైర్యసాహసాలను అక్కడున్న వారు అభినందించారు.