oil palm | ఖమ్మంలో గోద్రేజ్ భారీ పెట్టుబడి

oil palm | ఖమ్మంలో గోద్రేజ్ భారీ పెట్టుబడి

ఖమ్మంలో రూ.300 కోట్ల ఆయిల్ పామ్ ప్రాజెక్టు

తెలంగాణలో తొలి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్‌కు ఊతం
రూ.300 కోట్ల పెట్టుబడితో ఖమ్మంలో ప్రాజెక్టు.. 700 మందికి ఉపాధి
భూమి, రహదారి విస్తరణ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధుల భేటీ

ఆంధ్ర్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు తొలి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. ఈ అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సమావేశమై ప్రాజెక్టు పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ వ్యవహారాల అధ్యక్షుడు రాకేష్ స్వామి, గోద్రేజ్ ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ విభాగం ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సౌగత నియోగి పాల్గొన్నారు. రాష్ట్రంలో తొలి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.

ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఇందులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, నర్సరీ, పరిశోధన–అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే కేటాయించినట్లు తెలిపారు. సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా మరో 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్‌కు అనుసంధానంగా రహదారిని విస్తరించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రాసెసింగ్ యూనిట్‌కు అవసరమైన రహదారి విస్తరణ పనులను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.