revanth reddy| ప్రీమియర్ ఎనర్జీస్‌కు సీఎం రేవంత్ శ్రీకారం
తెలంగాణలో అత్యాధునిక సోలార్ మాడ్యూల్ ప్లాంట్ ప్రారంభం..
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో 5.6 గిగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక తయారీ కేంద్రం ప్రారంభం
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, అల్యూమినియం ఫ్రేమ్ యూనిట్లకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రభ, హైదరాబాద్: తెలంగాణను పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రస్థానంలో నిలిపే దిశగా మరో కీలక అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలోని ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన అత్యాధునిక ‘ఇండియాస్ నెక్స్ట్-జెన్ సోలార్ మాడ్యూల్’ తయారీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ తయారీ కేంద్రానికి 5.6 గిగావాట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే ఈ ప్లాంట్‌లో ప్రతి 16 సెకండ్లకు నాలుగు G12R TOPCon హై-ఎఫిషియెన్సీ సోలార్ మాడ్యూళ్లు తయారయ్యేలా ఆధునిక ఉత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోలార్ మాడ్యూళ్ల తయారీతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS), అల్యూమినియం ఫ్రేమ్‌ల తయారీ యూనిట్ల నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరింత ఊతం లభించడంతో పాటు, భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అత్యాధునిక తయారీ సామర్థ్యాల అభివృద్ధికి దోహదం కానుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
