congress | టీపీసీసీ వ‌ద్ద‌కు కొండా, క‌డియం పంచాయితీ

వివాదానికి త్వరలో ముగింపు?

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ
కడియం శ్రీహరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఇద్దరు నేతలతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ హామీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలు టీపీసీసీ దృష్టికి చేరాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను బుధవారం కలిసి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు.

దేవాదాయ శాఖకు సంబంధించిన అంశాలపై తనకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్షా సమావేశం నిర్వహించారని, ఇది ప్రభుత్వ ప్రోటోకాల్‌కు విరుద్ధమని కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆమె టీపీసీసీ అధ్యక్షుడిని కోరారు. ఇదే విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆమె వివరించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, గ్రూపు రాజకీయాలపై పార్టీ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోందని చెప్పారు. కొండా సురేఖ, కడియం శ్రీహరి ఇద్దరితో త్వరలోనే మాట్లాడి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని, అలాంటి చర్యలను పార్టీ ఏమాత్రం సహించబోదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని ఆయన తెలిపారు.