nara lokesh |కొరియా పెట్టుబడులపై లోకేశ్ దృష్టి..

ఏపీలో కియా విస్తరణకు ఆహ్వానం

కియా ఉన్నతాధికారులతో భేటీ..
ఈవీ, హైబ్రిడ్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన
కొరియా విదేశాంగ ఉపమంత్రితో సమావేశం..
గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఐదో రోజు పర్యటనలో భాగంగా సియోల్‌లో కియా కార్పొరేషన్ గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హన్ లీతో పాటు సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కియా కార్యకలాపాలను మరింత విస్తరించాలని లోకేశ్ కోరారు. ప్రత్యేక ప్రయోజనాల కోసం రూపొందించే పర్పస్-బిల్ట్ వెహికల్స్ (PBV)తో పాటు సమగ్ర ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే ప్రపంచ మార్కెట్లకు ఎగుమతుల కోసం విశాఖపట్నం పోర్టు సమీపంలో సీకేడీ (Completely Knocked Down) అసెంబ్లీ, ఎగుమతి కేంద్రం, ఈవీ పవర్‌ట్రెయిన్ టెస్టింగ్ సెంటర్, వెహికల్ హోమోలొగేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతపురంలోని కియా తయారీ యూనిట్‌ను మరింత విస్తరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కియా ప్రతినిధులు తెలిపారు.

అనంతరం దక్షిణ కొరియా విదేశాంగ ఉపమంత్రి సిసిలియా చుంగ్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత విశ్వసనీయ గమ్యస్థానమని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 3ఎస్ (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం పరిశ్రమలకు పూర్తి భరోసా కల్పిస్తుందని వివరించారు.

కొరియా–ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటు, రాష్ట్రంలో కొరియన్ కల్చరల్ సెంటర్ స్థాపన, సంయుక్త శిక్షణా అకాడమీలు ఏర్పాటు వంటి ప్రతిపాదనలను లోకేశ్ ముందుంచారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కొరియా సంస్థలను ఆహ్వానించారు.

విశాఖపట్నం–బుసాన్ లేదా ఇంచియాన్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు ప్రారంభించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో కొరియన్ భాషా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. రాష్ట్రంలోని ఆధునిక పోర్టుల సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, కొరియా–ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.